కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా పెనుబల్లి (Penuballi) మండలం (వీఎం బంజారా గ్రామం)కు చెందిన ఇల్లందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వంగ సుబ్బారావు (Vanga Subba Rao) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వంగ సుబ్బారావు 1972 నుండి 1978 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆ కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేసి ప్రజలలో మంచి గుర్తింపు పొందారు.
వంగ సుబ్బారావు మృతి పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఒక నిబద్ధత కలిగిన ప్రజా నాయకుడిగా వంగ సుబ్బారావు అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, శోకతప్త హృదయంతో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

