కలం, స్పోర్ట్స్: భారత అథ్లెటిక్స్‌లో మరో చారిత్రక ఘట్టం నమోదైంది. మహారాష్ట్ర హైజంపర్ సర్వేష్ కుషారే (Sarvesh Kushare) పురుషుల హైజంప్‌లో కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. భువనేశ్వర్‌లో జరుగుతున్న 65వ జాతీయ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 2.31 మీటర్లు దూకి భారత అథ్లెటిక్స్ చరిత్రలో కొత్త మైలురాయిని నెలకొల్పాడు. అధికారికంగా 2.30 మీటర్ల ఎత్తును దాటిన తొలి భారత హైజంపర్‌గా కూడా గుర్తింపు పొందాడు.
31 ఏళ్ల సర్వేష్.. 2018 ఏప్రిల్ 27న తేజస్విన్ శంకర్ నమోదు చేసిన 2.29 మీటర్ల జాతీయ రికార్డును అధిగమించాడు. అదే సమయంలో 2018 జాతీయ ఇంటర్ స్టేట్ పోటీల్లో బి. చేతన్ నెలకొల్పిన 2.25 మీటర్ల మీట్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ పోటీలకు ముందే ఆసియా క్రీడల అర్హత ప్రమాణమైన 2.19 మీటర్లను సర్వేష్ అధిగమించాడు. పోటీలో 2.31 మీటర్ల ఎత్తును మూడో ప్రయత్నంలో విజయవంతంగా దాటాడు.
రెండో స్థానంలో ఆదర్శ్ రామ్
అనంతరం 2.35 మీటర్ల ఎత్తును చేరేందుకు రెండు ప్రయత్నాలు చేసినా సఫలం కాలేకపోయాడు. తమిళనాడుకు చెందిన ఆదర్శ్ రామ్ 2.25 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు. అతడు కూడా పాత మీట్ రికార్డును అధిగమించడంతో పాటు ఆసియా క్రీడల అర్హత ప్రమాణాన్ని అందుకున్నాడు. కర్ణాటకకు చెందిన జెస్సీ సందేశ్ 2.19 మీటర్లు దూకి మూడో స్థానంలో నిలిచాడు. అతడు కూడా ఆసియా క్రీడల అర్హత మార్క్‌ను సమం చేశాడు.
సర్వేష్ కుషారే కెరీర్‌లో ఇది మరో గొప్ప మైలురాయి. గతంలో పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అతడు.. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో హైజంప్‌లో నిలకడగా రాణిస్తున్న అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పుడు 2.31 మీటర్ల కొత్త జాతీయ రికార్డుతో ఆసియా క్రీడల ముందు భారత్‌కు కొత్త ప్రమాణాన్ని నెలకొల్పాడు. ఇదే సర్వేష్ సాధించిన తొలి చారిత్రక ఘనత కాదు. 2025 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ అతడు చరిత్ర సృష్టించాడు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్ పురుషుల హైజంప్ ఫైనల్‌కు చేరిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచాడు. ఆ పోటీలో 2.28 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో ఆరో స్థానంలో నిలిచి, ప్రపంచ ఛాంపియన్‌షిప్ హైజంప్‌లో భారత పురుషుల విభాగంలో అత్యుత్తమ ఫినిష్ నమోదు చేశాడు. ఈ తాజా ప్రదర్శనతో సర్వేష్ కుషారే భారత హైజంప్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు.

