కలం, నల్లగొండ బ్యూరో: పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని గుల్ల చేసిందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం (Vemula Veeresham) అన్నారు. ఆదివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేముల వీరేశం మాట్లాడారు. కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కేటీఆర్ అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పదేండ్ల పాలనలో అభివృద్ధి పేరుతో అనేక దోపిడీలు, అక్రమాలు జరిగాయని వీరేశం ఆరోపించారు. రాష్ట్ర ఖజానాను పూర్తిగా విధ్వంసం చేసి, ఆర్థికంగా దెబ్బతీశారని విమర్శించారు.
కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో శని, ఆదివారాల్లో ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండని చరిత్ర ఆయనదని, అలాంటి వ్యక్తి ఇప్పుడు తమకు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సొంత పార్టీ నాయకులతోపాటు తెలంగాణ ఉద్యమకారులను సైతం మోసం చేసిన ఘనత బీఆర్ఎస్‌దేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజాపాలన సాగిస్తూ.. ‘ఇందిరమ్మ రాజ్యం’ దిశగా అడుగులు వేస్తోందని వీరేశం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకుపోతోందని కొనియాడారు.
ప్రజలు బుద్ధి చెప్పినా మారడం లేదు
గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇటీవల ఎన్నికల వరకు ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా ఇస్తూ వరుసగా తిరస్కరిస్తున్నా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదని వేముల వీరేశం ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ఉనికి కోల్పోవడంతో దిక్కుమాలిన అడ్డగోలు సర్వేలను సృష్టించి, “మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం” అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసుకోవడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో చెరువుల ఆక్రమణలు, భూకబ్జాలు విపరీతంగా జరిగాయని.. తెలంగాణను డ్రగ్స్ కేంద్రంగా మార్చిన విషయాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి శ్రీరామరక్షగా నిలిచి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పారదర్శక పాలన అందిస్తున్నారని వీరేశం (Vemula Veeresham) స్పష్టం చేశారు.
Read Also: ‘నేను కూడా రోడ్డు మీదకు వస్తా’.. అధికారులపై సీఎం రేవంత్ సీరియస్
Follow Us On : WhatsApp

