కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నూతన భవన నిర్మాణానికి రూ. 23 కోట్ల నిధులు మంజూరు కావడంలో కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే, పాలకులు, అధికారులు, ఉద్యమంలో భాగస్వాములైన నాయకులకు అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా. సతీష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. అఖిలపక్ష ఐక్యవేదిక పోరాట ఫలితంగానే ఈ నిధులు మంజూరై భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
గురువారం అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు పాలిటెక్నిక్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డా. సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో శిథిలావస్థకు చేరిన పాలిటెక్నిక్ ప్రధాన భవనం (రాజప్రసాదం) సమస్యపై అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహించి, అప్పటి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను కలిసి వినతిపత్రం అందజేశామని గుర్తు చేశారు.
తమ వినతులు, సిఫార్సుల మేరకు రూ. 23 కోట్ల నిధులకు ఆమోదం లభించిందని అన్నారు. నిధులు మంజూరైన తర్వాత కూడా పనులు ఆలస్యం కావడంతో మరోసారి పోరాటం చేసి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చేశామని తెలిపారు. ప్రస్తుతం నూతన విద్యా భవనం పై అంతస్తులు, వెనుక భాగంలో నిర్మిస్తున్న హాస్టల్ భవనాల పనులను నాణ్యత ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను కోరినట్లు చెప్పారు.
అయితే శిథిలావస్థలో ఉన్న రాజప్రసాదం (రాజా బంగ్లా) భవనం మరమ్మతు పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని రాజా బంగ్లా మరమ్మతు పనులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకుడు కొత్తగొల్ల శంకర్, బీఎస్పీ నాయకుడు మైబూస్, లోక్‌సత్తా నాయకుడు రాజ్‌కుమార్, బీజేపీ నాయకులు రవి, రామస్వామి, శివకుమార్, చంద్రశేఖర్, సూర్య నాయక్, జయరాములు తదితరులు పాల్గొన్నారు.

