కలం, వెబ్ డెస్క్: ప్రపంచంతోనే పోటీ పడేలా తెలంగాణ విద్యార్థులు తయారు కావాలనేదే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అందుకోసమే, విద్యా శాఖను తన వద్ద ఉంచుకుని పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
విద్యా మంత్రిగా ఎందుకు తప్పుకోవాలి..?
తాను ఎందుకు విద్యా శాఖ మంత్రిగా తప్పుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంచిగా పనిచేస్తున్నందుకా.. టీచర్లకు వివాదం లేకుండా ప్రమోషన్లు లేనందుకా.. ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకా.. అని ప్రశ్నించారు. విద్యా శాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ప్రమోషన్స్ ఇచ్చే బాధ్యత నాదే..
ఉపాధ్యాయ సంఘాలు అయిదేళ్లు విద్యార్థులపై శ్రద్ధ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రమోషన్స్ సహా అన్నీ ఇంటికి పంపించే బాధ్యత తనదే అన్నారు. గతంలో ఒకటో తేదీన ఎప్పుడైనా జీతాలు వచ్చిన పరిస్థితి ఉందా.. అని ప్రశ్నించారు. తాను వచ్చాకే.. టీచర్లకు సరైన సమయానికి సాలరీలు ఇస్తున్నట్లు వివరించారు. ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం చాలా సులువని, కానీ టీచర్లను మాత్రం బదిలీ చాలా కష్టమైన పని అన్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో చదివే సీఎం..
ప్రతి వ్యక్తికి విద్యార్థిలా ఉండే క్రమశిక్షణ అవసరమని.. అది లేకపోతే జీవితంలో ఏదీ సాధించలేమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను కూడా విద్యార్థిలా మారిపోయి, అయిదు రోజుల పాటు హార్వర్డ్ యూనివర్సిటీలో పాఠాలు విన్నట్లు తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే తాను సీఎం స్థాయికి ఎదగానని.. టీచర్ల గౌరవం తగ్గే పనులు తాను ఎప్పుడూ చేయబోనని వివరించారు.

