కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam) అన్నారు. మహబూబ్‌నగర్ (Mahabubnagar) నగరంలోని ఓం కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు, కార్పొరేటర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు చేరువవుతూ వారి సమస్యలను అర్థం చేసుకుని ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయించడంలో కార్యకర్తల పాత్ర కీలకమని తెలిపారు.
గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలంటే ప్రతి కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతో పోలిస్తే, కేవలం రెండున్నర సంవత్సరాలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి, విద్యా రంగంలో పురోగతి సాధించామని తెలిపారు. “దేశం ముందు – తర్వాత పార్టీ, ఆ తర్వాత వ్యక్తిగతం” అనే సిద్ధాంతాన్ని ప్రతి కార్యకర్త ఆచరించాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడానికి సేవాభావం అవసరమని అన్నారు.
రాబోయే రెండున్నర సంవత్సరాలు పార్టీకి కీలకమని, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన (MLA Yennam) ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శి సుభాష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, డిసిసి నాయకులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, రాములు యాదవ్, సాయిబాబా, అజ్మత్ అలి తదితరులు పాల్గొన్నారు.
Read Also: క్రమశిక్షణే విజయానికి మూలం: విజయ్ దేవరకొండ
Follow Us On : WhatsApp

