కలం, నల్లగొండ బ్యూరో : జూన్ నెల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆల్పాహారం అందించనుందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం (Vemula Veeresham) తెలిపారు. నల్గొండ (Nalgonda) జిల్లా నకిరేకల్‌లోని నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మన ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభలు, మండల సభలు, నియోజకవర్గ స్థాయి సభలు నిర్వహిస్తోందన్నారు. గత ప్రభుత్వం పదేండ్లు పరిపాలించి భారీగా అప్పులు చేసిందని, చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని తెలిపారు.
తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలిచేలా “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి రూపొందించారని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో, నిబద్ధతతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1 కోటి వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పించిన ఘనత మన ప్రభుత్వానిదేనని ఆయన (Vemula Veeresham) అన్నారు. ప్రమాదవశాత్తు ఇంటి పెద్ద చనిపోతే రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజితశ్రీనివాస్, చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ పందిరి గీతారమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి, నియోజకవర్గ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణ టెంపుల్ టూరిజం : మన గుడులు.. మన సంస్కృతి
Follow Us On: X(Twitter)

