కలం, నిజామాబాద్ బ్యూరో: రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వహించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులను అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని బీఆర్ఎస్ (BRS) మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా గాంధారిలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించగా ఎస్‌ఐ మహేందర్ ఆ కాంగ్రెస్ జెండాకు సెల్యూట్ చేయడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు.
రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పోలీసు అధికారి ఒక రాజకీయ పార్టీ జెండాకు సెల్యూట్ చేయడం కాంగ్రెస్ పార్టీ పోలీస్ వ్యవస్థను వారికి అనుకూలంగా మలచుకొని ఎంతగా నిర్వీర్యం చేసిందో స్పష్టం అయిందని దుయ్యబట్టారు. ఇటువంటి చర్యలు పోలీసు వ్యవస్థ నిష్పాక్షికతపై ప్రజల్లో అనుమానాలు కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ వెంటనే విచారణ జరిపించి, ఎస్ఐ మహేందర్ పై తగిన చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) డిమాండ్ చేశారు.

