Mobile Popup Ad
Mobile Popup Ad

రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం: వేముల ప్రశాంత్ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో: రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) విమర్శించారు. తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు “మళ్లీ కేసీఆర్ రావాలి.. కేసీఆర్ పాలనే బాగుండేది” అని చెబుతున్నారని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మాటల్లోనే ఉన్నారని, చేతల్లో ఏమీ లేదని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, యూత్, రైతు డిక్లరేషన్లన్నీ ఉత్త మాటలుగానే మిగిలిపోయాయని మండిపడ్డారు. బుధవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, సర్ అవగాహన సదస్సు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఏజెంట్ల విస్తృత స్థాయి సమావేశానికి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

గెలుపోటములు సహజం

రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలను ఎదుర్కొంటూ, ఇంత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సమావేశానికి రావడం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి బలమైన సంకేతమని ధీమా వ్యక్తం చేశారు.

దండగ ప్రభుత్వం

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దండగ ప్రభుత్వమని వేముల అభివర్ణించారు.  సామాన్య ప్రజలే సోషల్ మీడియాలో బహిరంగంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రైస్ మిల్లర్లు కుమ్మక్కై తరుగు పేరిట క్వింటాలుకు 12 కిలోలు తీస్తూ రైతుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని వేముల తీవ్రంగా ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోనే దాదాపు రూ.200 కోట్ల రైతుల సొమ్ము తరుగు పేరుతో మిల్లర్లు, కాంగ్రెస్ నాయకుల మధ్య పంచుకుంటున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఈ దోపిడి రూ.2,000 కోట్లకు చేరిందని అన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో ఎందుకింత జాప్యం

ధాన్యం కొనుగోళ్లలో ఎందుకింత జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలే రైతుల తరఫున కల్లాల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి పోరాడారని పేర్కొననారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం లేదని విమర్శించారు. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్, మోదీ కలిసి వ్యాట్ వేసి పెట్రోల్‌ను ₹100కు అమ్ముతున్నారని విమర్శించారని గుర్తుచేశారు. “ఇవాళ రాష్ట్రంలో నీ ప్రభుత్వమే ఉంది కదా రేవంత్ రెడ్డి.. మరి 35 శాతం వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదు?‘ అని వేముల ప్రశ్నించారు.

కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలు

కాంగ్రెస్, బీజేపీ రెండు తోడు దొంగల పార్టీలని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌కు చెందిన బూత్ ఏజెంట్లు, గ్రామ ముఖ్య నాయకులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. చనిపోయిన వారి ఓట్లు తొలగిస్తున్నారా లేదా అన్నది నిశితంగా పరిశీలించాలి.  కొత్తగా ఓటు హక్కు పొందే వారితో ఫారమ్‌లు పూర్తి చేయించి ఓటర్ల జాబితాలో చేర్పించాలి. ‘ అంటూ సూచించారు.

ఓట్లను కాపాడుకుందాం

“మన ఓట్లను కాపాడుకోవడం, కొత్త ఓట్లను నమోదు చేయించడం ప్రస్తుతం అత్యంత కీలకమైన కార్యక్రమం” అని స్పష్టం చేశారు. బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన వివాదాన్ని ప్రస్తావిస్తూ, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అతన్ని కాపాడే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. ఒకరు “లొంగిపోయాడు” అంటుంటే, మరొకరు “అరెస్ట్ చేశాం” అంటున్నారని.. అసలు నిజం ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నేతలు, సర్స భ్యత్వ నమోదు జిల్లా బాధ్యులు విజి గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, హన్మంత్ షిండే, సోషల్ మీడియా ఇంచార్జ్ క్రిశాంక్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు, రాజారామ్ యాదవ్, కార్యక్రమం నియోజకవర్గ ఇంచార్జ్ ఉదయ భారతి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>