Mobile Popup Ad
Mobile Popup Ad

అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం

కలం, మెదక్ బ్యూరో: ఉమ్మ‌డి మెద‌క్ (Medak ) జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. సిద్దిపేట , సంగారెడ్డి , మెద‌క్ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన వేలాది ధాన్యం బస్తాలు అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి నీట మునిగిపోయాయి. తూకం వేసి సిద్ధంగా ఉంచిన బస్తాల్లోకి వరద నీరు చేరడంతో పాటు ఆరబోసిన ధాన్యం కుప్పల కింద నుంచి కూడా వర్షపు నీరు ప్రవహించింది. అర్ధ‌రాత్రి అకాల వ‌ర్షం కురియ‌డంతో రైతులు స‌ర్దుకునే లోపే జ‌ర‌గ‌వ‌ల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.

భారీ వ‌ర్షంలో పండించిన ధాన్యంను కాపాడుకోవ‌డానికి రైతులు చీక‌ట్లో నాన అవ‌స్ధ‌లు ప‌డ్డారు. రోడ్లు మీద అర‌బెట్టిన ధాన్యం రాశుల ప‌రిస్థితి అయితే మ‌రింత ద‌య‌నీయంగా మారింది. వ‌ర‌ద ప్రవాహ‌నికి వడ్ల రాశులు కొట్టుకుపోయి రైతుల‌కు తీర‌ని న‌ష్టం వాటిల్లింది. కళ్లముందే చేతికొచ్చిన పంట నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇప్ప‌టికే మూడు నాలుగు సార్లు అకాల వ‌ర్షాలు కురియ‌డంతో పాటు .. రానున్న రోజుల్లో వ‌ర్షాలు ఉండే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ధాన్యం ప‌రిస్ధితి గాల్లో దీపంలా మారి రైతులను మ‌రింత అందోళ‌న‌కు గురిచేస్తుంది.

వ‌ర్షం మిగిల్చిన అపార న‌ష్టం

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ యార్డులో వ‌ర్షానికి పెద్ద ఎత్తున వడ్ల బస్తాలు, ధాన్యం రాశులు త‌డిసి ముద్ధ‌య్యాయి. ప‌లు ప్రాంతాల్లో రోడ్ల పైన ఉన్న వ‌డ్ల రాశుల‌ను వ‌ర‌ద ముంచెత్త‌డంతో ధాన్యం కొట్టుకు పోయింది. గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో ధాన్యం త‌డిసింది. రోడ్ల‌పైన అర‌బెట్టిన ధాన్యం భారీ వ‌ర్షానికి రోడ్ల‌పైన ప్ర‌వాహించింది. త‌డిసిన ధాన్యంను ప్ర‌భుత్వం వెంట‌నే కొనుగోలు చేయాల‌ని కొండ‌పాక -దుద్ధెడ రాజీవ్ ర‌హ‌దారిపై రైతులు రాస్తారోకో చేశారు.

మెద‌క్ జిల్లా తూఫ్రాన్ , చేగుంట‌, చిన్న‌శంక‌రంపేట‌, రామాయంపేట మండ‌లాల్లో పెద్దఎత్తున క‌ల్లాల్లోని వ‌రి ధాన్యం వ‌ర్షానికి త‌డిసింది. మెద‌క్ క‌లెక్ట‌రేట్ ముంద‌ట హ‌వేలి ఘ‌న‌పూర్ మండ‌లం స‌ర్ధన గ్రామ రైతులు త‌డిసిన ధాన్యంను కొనుగోలు చేయాల‌ని, లారీలు తెప్పించాల‌ని ధ‌ర్నా నిర్వ‌హించారు. త‌డిసిన ధాన్యం కొంటామ‌ని ,లారీల‌ను పంపి కొనుగోలు వేగంగా పూర్తి చేస్తామని మెదక్ అడిషిన‌ల్ క‌లెక్ట‌ర్ హ‌మీ ఇవ్వ‌డంతో ధ‌ర్నాను విర‌మించారు. కొల్చారం మండ‌లం చిన్న ఘ‌న‌పూర్ గ్రామ‌స్తులు త‌డిసిన ధాన్యంను కొనుగోలు చేయాలని మెదక్ -సంగారెడ్డి ప్ర‌ధాన ర‌హ‌దారిపై రైతులు బైఠాయించి అందోళ‌న నిర్వహించారు.

సంగారెడ్డి జిల్లాలోనూ అకాల వ‌ర్ష ప్ర‌భావం తీవ్రంగానే ఉన్న‌ది. నార‌య‌ణ ఖేడ్ ,అందోల్ నియోజ‌క‌వ‌ర్గాల మీద ప్ర‌భావం పడింది . కల్హేర్ మండలం జెంలా తండాలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వ‌ద్ద వంద‌లాది ధాన్యం బ‌స్తులు వ‌రుణుడి దెబ్బ‌కు త‌డిసిపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో కూడా అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతికొచ్చిన పంట వర్షం పాలవడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అందోళ‌న వ‌ద్దు ..త‌డిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం

సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతో తడిసిన వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ కే. హైమావతి భరోసా ఇచ్చారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతో తడిసిన ధాన్యం డేటా సేకరించి ప్రతి గింజను ప్రభుత్వం తరుపున కొనుగోలు చేస్తామన్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం కొని, వెంటనే బెయిల్డ్ రైస్ మిల్లులకు పంపాలని ఆదేశాలు ఇచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. త‌డిసిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని … రైతులు సహకరించాలన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి. మెద‌క్ క‌లెక్ట‌ర్ ప్ర‌తీమా సింగ్ అకాల వ‌ర్షాల న‌ష్టం ,త‌డిసిన ధాన్యం కొనుగోలు సంబంధించి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండ‌ల ప్ర‌త్యేక అధికారులు, కొనుగోలు సంబంధిత అధికార‌లతో జూమ్ మీటింగ్ నిర్వ‌హించారు. త‌డిసిన ధాన్యం విష‌యంలో రైతుల‌ను ఇబ్బందులు పెట్ట‌వ‌ద్ద‌ని … ప్ర‌భుత్వ త‌రుపున కొనుగోలు చేయాల‌ని సూచించారు. రానున్న రోజుల్లో వ‌ర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండి.. కొనుగోలు వేగ‌వంతంగా చేయాల‌ని అదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>