కలం, వరంగల్ బ్యూరో: రాబోయే 25 ఏండ్లు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి (Vem Narender Reddy) అన్నారు. తనకు దేవుడు ఇచ్చిన సోదరుడు, ప్రాణ మిత్రుడు రేవంత్ రెడ్డి అని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఎనిమిదేండ్లు రేవంత్ రెడ్డిని ఎన్నో ఇబ్బందులు పెట్టారని.. రేవంత్ రెడ్డి కష్టాలను దగ్గరగా చూశానన్నారు.
రేవంత్ రెడ్డి ఆదేశాలు ప్రతి ఒక్కటి తు.చ. తప్పకుండా నమ్మకంగా పాటిస్తానని ఆయన తెలిపారు. ఆదివారం హనుమకొండలోని ఢీ కన్వెన్షన్ సెంటర్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేం నరేందర్ రెడ్డికి (Vem Narender Reddy) సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పదేండ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొని కార్యకర్తల కృషితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రెండున్నరేండ్ల స్వేచ్ఛాయుత పాలన కాంగ్రెస్ సొంతమన్నారు. బడుగు బలహీన వర్గాల ప్లాట్ ఫామ్ కాంగ్రెస్ పార్టీ. దానికి నాయకత్వం వహించిన రేవంత్ రెడ్డి సుపరి పాలన సాగిస్తున్నాడని కొనియాడారు. ఓరుగల్లు అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. రూ.2200 కోట్లతో 11 నియోజకవర్గల్లో యంగ్ ఇండియా స్కూల్స్ ఇచ్చామని త్వరలో జనగామ నియోజకవర్గానికి కూడా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో ఎదుటివారు చెబితే వినే ఓపిక, సున్నితత్వం అవసరమని, అదే నేను నమ్మిన సిద్ధంతంగా తెలిపారు.
రాజకీయాల్లో అవకాశం వచ్చిన 10 శాతం మంది నేతలు మిగతా 90 శాతం వారికి చెదోడుగా ఉండాలని ఆయన సూచించారు. జులై నెలలో మామునూర్ ఎయిర్ పోర్ట్ (Mamnoor Airport) శంకుస్థాపనకు ప్రధాని మోదీ వస్తారని, జూన్ నెలలో టెండర్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజి కి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ పై జెండా ఎగురవేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ సభలో మంత్రులు కొండాసురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, జాటోత్ రామ్ చందర్ నాయక్, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read Also: నన్ను ఆయన చెప్పుతో కొట్టాడు.. సంచలన విషయాలు వెల్లడించిన బండ్ల గణేష్!
Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!

