కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలో కరెంట్ కోతలతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని.. ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని ఏఐకేఎంఐ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య (Velpuri Bhoomaiah) డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందించారు. పగటి పూటనే 12 గంటల కరెంట్‌ను సప్లై చేయాలని.. అవసరమైతే గుత్ప, ఆలీసాగర్, లిఫ్టుల ద్వారా నీటిని విడుదల చేయాలన్నారు. అధికారులు చెప్పిన విధంగా రబీలో ఆరు తడి పంటలకు వెళ్లాలని అన్నారని.. ఇప్పుడేమో పంటలే వేయొద్దని చెప్పడమేంటన్నారు. బోర్లు, చెరువుల కింద ఆరుతడి పంటలకు అనుమతిని ఇవ్వాలని భూమయ్య పేర్కొన్నారు.
పంట విత్తనాలు సబ్సిడీకి..
మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర, మినుములు తదితర పంటలకు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా, మిగిలిన రైతులకు 80 శాతం సబ్సిడీతో ఇవ్వాలని వేల్పూరు భూమయ్య కోరారు. చెరుకు పంట కూడా ఆరుతడి పంట అయినందున సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలన్నారు. యంత్ర లక్ష్మీలో 80 శాతం రాయితీలు యంత్రాలను రైతులకు అందించి వారిని సాగు వైపు ప్రోత్సహించాలని కోరారు. పాత రుణాలు రీ షెడ్యూల్ చేసి కొత్తగా రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు, అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, కె.గోపాల్, అగ్గు చిన్నయ్య, రాపాని గంగాధర్, బి.సాయిలు, సంజీవ్ పాల్గొన్నారు.

