నిర్మల్‌లో రంగు మారిన భగీరథ నీరు

కలం, నిర్మల్‌ : నిర్మల్ పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాల్సిన పట్టణ భగీరథ నీరు (Mission Bhagiratha Water) రంగు మారి సరఫరా అవుతుండటంతో నిర్మల్‌ వాసులు ఆందోళన చెందుతున్నారు. గత నాలుగు రోజులుగా పలు ప్రాంతాల్లో నల్లాల నుంచి పసుపు రంగులో మట్టి కలిసినట్లుగా నీరు వస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ నీటిని తాగేందుకు జంకుతున్నారు. రోజువారీ అవసరాలకు సైతం వినియోగించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

42 వార్డులకు ఇదే నీటి సరఫరా..

నిర్మల్‌ పట్టణంలోని 42 వార్డులకు గాంధీ పార్క్‌, ఆదర్శనగర్‌, బంగల్‌పేట్‌, బైల్‌బజార్‌ తదితర ప్రాంతాల్లోని ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఎస్సారెస్పీ నుంచి మాడేగాం ఫిల్టర్‌ బెడ్‌కు తరలించిన నీటిని శుద్ధి చేసి పట్టణానికి అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో ఆల్గే (నాచు) పెరగడంతో నీటి రంగు మారుతున్నట్లు పేర్కొంటున్నారు. నాలుగు రోజులుగా నీటి రంగు మారుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని కొన్ని కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్‌ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు నీటి (Mission Bhagiratha water) నాణ్యతపై ప్రజల్లో ఆందోళన నెలకొంది.

వేడి చేసి చల్లార్చాకే వినియోగించాలి: మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబు

రంగు మారిన నీటి సరఫరాపై మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబు ప్రెస్ నోట్ విడుదల చేశారు. పట్టణంలోని 42 వార్డులకు మాడేగాం వద్ద శుద్ధి చేసిన నీటినే సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందకుండా నీటిని వేడి చేసి, చల్లార్చిన తర్వాత వినియోగించాలని సూచించారు. మరో రెండు రోజుల్లో స్వచ్ఛమైన నీటి సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>