కలం, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) జరగనుంది. ఉదయం 10 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులంతా దీనికి హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయమై చర్చించబోతున్నారు. అలాగే, రాజధాని అమరావతికి సంబంధించి సీఆర్డీఏ రూపొందించిన పలు ప్రతిపాదనలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
అదే సమయంలో రూ.88,392 కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఏపీ కేబినెట్ తెలపనుంది. రోడ్లు, నీటి పారుదల, మౌలిక వసతుల వంటి ఆరు కీలక రంగాల్లో భారీ ప్రాజెక్టులకు ఓకే చెప్పనుంది. ఇవి కాకుండా 54,210 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పలు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వనుంది. సమావేశం అనంతరం వివరాలను మంత్రులు మీడియా సమావేశంలో వెల్లడించబోతున్నారు.

