కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అంతర్జాతీయ భద్రతా అంశాలపై మరోసారి తన కఠిన వైఖరిని స్పష్టం చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను సమకూర్చుకోలేదని, ఆ దేశం అణ్వస్త్ర దేశంగా మారే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.
థాంక్స్ గివింగ్ పండుగ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కలిసి మధ్యప్రాచ్యంలో విధులు నిర్వహిస్తున్న అమెరికా సైన్యంలోని ఎయిర్ డిఫెన్స్ దళాలతో ఫోన్లో మాట్లాడారు. శత్రు దేశాలకు చెందిన 560 క్షిపణులు, డ్రోన్లను సమర్థవంతంగా కూల్చివేసినందుకు అమెరికా సైనికులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగానే ఇరాన్ అణ్వాయుధాల విషయంపై ట్రంప్ కీలక హెచ్చరిక చేశారు.
మరోవైపు, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో జరిగిన తన సమావేశ వివరాలను కూడా డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే విషయంలో మార్క్ రుట్టే కూడా ఏకీభవించారని తెలిపారు. ఈ భేటీలో ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి సుదీర్ఘంగా చర్చించామని, అలాగే గ్రీన్లాండ్ అంశంతో పాటు నాటో సరిహద్దుల చుట్టూ నెలకొన్న భద్రతా పరిస్థితులపై కూడా సమీక్షించామని ట్రంప్ పేర్కొన్నారు.

