కలం, నిర్మల్ : బాధితుల సమస్యలను సత్వరగా, పారదర్శకంగా పరిష్కరించడమే ప్రజావాణి కార్యక్రమం(Prajavani Programme) ప్రధాన లక్ష్యమని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను ఆమె స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్‌స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపడమే ప్రజావాణి ఉద్దేశమని తెలిపారు. పోలీస్‌స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. బాధితుల వినతులను ఓపికగా విని, ఫిర్యాదులను స్వీకరించాలని పేర్కొన్నారు.

