కలం, నిర్మల్ : తెలంగాణలో దొరల రాజ్యం గంగలో కలిసిపోయిందని, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో సంబరాలు నిర్వహించారు. భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేసి చూపించిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. రాష్ట్రంపై అప్పుల భారం ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందని తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ కలలు కంటున్నారని, అది జన్మలో నెరవేరదని, కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం తప్పదని అన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డిని కనీస మర్యాద లేకుండా మాట్లాడటం సరికాదని, కేటీఆర్ మాటలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
తమను కూడా అదే భాషలో మాట్లాడేలా చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిష్యుడినని, ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడినని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిర్మల్ లో గతంలో ‘సండే ఎమ్మెల్యే’ ఉండేవారని, ఇప్పుడు ‘మంత్లీ ఎమ్మెల్యే’ అయ్యారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అని విమర్శించారు. మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. నాయకులతో కొంత గ్యాప్ ఏర్పడిన మాట వాస్తవమేనని, అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన అనంతరం అందరినీ కలుస్తానని చెప్పారు.
బైక్ ర్యాలీలో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన శ్రీహరి రావు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోందని, వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
అనంతరం శ్రీహరి రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి, 2028 ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

