వాట్ నెక్స్ట్?.. ‘సిట్’ టీమ్‌తో చీఫ్ సజ్జనార్ మీటింగ్

కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్‌ (Phone Tapping) వ్యవహారంలో సిట్‌కు (SIT) ప్రభుత్వం ఇచ్చిన ఒక టాస్క్ పూర్తయింది. ఇక తదుపరి స్టెప్ ఏంటనేది కీలకంగా మారింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చీఫ్‌గా ఆ టీమ్‌తో నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ (VC Sajjanar) సుదీర్ఘంగా సమావేశమై సమీక్షించారు. సిట్‌ను ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలేంటి?.. టైమ్ ప్రకారం వాటిని కంప్లీట్ చేశామా?.. ఎదురైన ఇబ్బందులేంటి?.. వాటిని ఎలా అధిగమించాం?.. ఇంకా మిగిలిపోయిన టాస్క్ ఏంటి?.. ఎప్పటిలోగా దాన్ని కూడా కంప్లీట్ చేయాలి?.. ఇలాంటి అంశాలమై టీమ్ సభ్యులతో సజ్జనార్ చర్చించినట్లు తెలిసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Centre) బిల్డింగ్‌లో ఉదయం నుంచి జరుగుతున్న ఈ సమావేశంలో ఇప్పటివరకు చేపట్టిన కార్యాచరణను రివ్యూ చేయడంతో పాటు ఇకపైన టేకప్ చేయాల్సిన అంశాలపై డైరెక్షన్ ఇచ్చినట్లు సమాచారం.

మున్సిపల్ ఎన్నికల వేళ వ్యూహంపై ఉత్కంఠ :

సజ్జనార్‌కు (VC Sajjanar) ఏ బాధ్యత అప్పజెప్పినా అందులో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుందని, ఆయన పోషించే రోల్ సైతం ఒక సంచలనంతో కూడి ఉంటుందనేది పోలీసు వర్గాల్లో జనరల్‌గా ఉండే అభిప్రాయం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని సైతం ప్రభుత్వం ఆయనకు అప్పజెప్పడంతో ప్రారంభంలో అదే అభిప్రాయం నెలకొన్నది. నెల రోజుల కార్యాచరణ చూసిన తర్వాత కేసీఆర్‌కు సైతం నోటీసులు ఇచ్చి సాహసాన్ని ప్రదర్శించారనే మాటలూ వినిపించాయి. ఈ కేసులో కీలక వ్యక్తులను విచారించే ప్రక్రియ దాదాపు కొలిక్కి రావడంతో వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తిని రేకెత్తిస్తున్నది. తదుపరి యాక్షన్ ప్లాన్‌లో ఎలాంటి ట్విస్ట్ ఉంటుందోననే చర్చలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు మరో వారం రోజుల టైమ్ ఉండడంతో ఈలోగా ఎలాంటి సంచలనాలు జరుగుతాయనే అనుమానాలు నెలకొన్నాయి. కొత్తగా నోటీసులు అందుకునేవారు ఎవరనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది.

సప్లిమెంటరీ చార్జిషీట్‌పైనే ఉత్కంఠ :

విచారణ పర్వం ముగిసిన తర్వాత దర్యాప్తులో కొత్త కోణం ఆవిష్కరిస్తుందనే మాటలు పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నాయి. సప్లిమెంటరీ చార్జిషీట్‌లో సిట్ ఎవరిపై గురి పెడుతుంది?.. ఎలాంటి సంచలనాలను వెల్లడిస్తుంది?.. ఎంక్వయిరీలోనూ, వాంగ్మూలాల్లో ఏ అంశాలు వెల్లడయ్యాయి? ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగింది?.. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి?.. ఇలాంటివన్నీ ఉటంకించే అవకాశాలున్నాయి. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సిట్ తదుపరి కార్యాచరణ ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. సిట్ పిలిస్తే హాజరై వివరణ ఇవ్వడానికి సిద్ధమంటూ కల్వకుంట్ల కవిత ఇటీవలే కామెంట్ చేయడంతో ఆమెకు నోటీసులు వస్తాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 Read Also: విద్యుత్ స్థంభాలు, గృహ కనెక్షన్లపై కీలక మార్పులు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>