కలం, వెబ్‌డెస్క్: మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత (Konda Susmita) ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసిన ఓ స్టోరీ ఆసక్తికర చర్చకు తెరలేపింది. కొండా టీమ్ పేరుతో ఓ యువకుడు తన ఇన్‌స్టా స్టోరీలో సుస్మితతో దిగిన ఓ ఫోటో పోస్ట్ చేశాడు. అందులో పరకాల అప్‌కమింగ్ పరకాల ఎమ్మెల్యే (Parakala MLA) అనే క్యాప్షన్ జోడించి, సుస్మితను మెన్షన్ చేశాడు. అయితే ఆ స్టోరీని సుస్మిత తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే కొండా దంపతులు సుస్మితను వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి బరిలో దింపాలని భావిస్తున్నారు. గతంలో కొండా సురేఖ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కొన్ని నెలల క్రితం బహిరంగంగానే పరకాలలో సుస్మిత పోటీపై ప్రకటనలు చేశారు. అయితే ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కొండా సురేఖ సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారిన తరుణంలోనే సీఎం రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాశ్ వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచే పోటీ చేస్తారని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని సభా వేదికగా ప్రకటించారు. దీంతో పరకాల టికెట్ రేవూరికేనని పార్టీలో చర్చ మొదలైంది.
ఇక సీఎం ప్రకటన తర్వాత కొండా ఫ్యామిలీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. కానీ, ఒక్క రోజు గ్యాప్‌లోనే కొండా సుస్మిత ఇన్‌స్టా వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చేసింది. మరోవైపు సుస్మిత ఇన్‌స్టా స్టోరీపై రేవూరి ప్రకాశ్ స్పందించారు. తనకు టికెట్ ఖరారైనట్లేనని, ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్తున్నారు. దీనిపై కొండా సురేఖ దంపతుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి.

