ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

కలం, కరీంనగర్ బ్యూరో: “పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని దుద్దెనపల్లి గ్రామంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar) పర్యటించారు. గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించారు. అనంతరం రైతు వేదికలో నిర్వహించిన ”పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా ప్రజా పాలన” కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులతో మంత్రి నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజా పాలనలో దుద్దెనపల్లిలో అభివృద్ధి

ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దుద్దెనపల్లి గ్రామంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు. అలాగే సైదాపూర్ మండలంలో మొదటి దశలో 486 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 370 ఇళ్లు పూర్తయినట్లు తెలిపారు. మరో 170 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. నియోజకవర్గాన్ని గుడిసెలు లేని నియోజకవర్గంగా మార్చడమే లక్ష్యమన్న మంత్రి.. అత్యంత పేదలు, గుడిసెల్లో నివసిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యతతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే దుద్దెనపల్లిలో 32 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 29 ఇళ్లు పూర్తయినట్లు తెలిపారు. ఇద్దరు లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోలేమని రద్దు చేసుకున్నారని చెప్పారు. గ్రామంలోని 49 స్వయం సహాయక సంఘాలకు రూ.20.86 లక్షలు అందించామని.. 50 గ్రూపులకు బ్యాంకు లింకేజీ కింద రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. 982 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.3.56 కోట్లు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. రైతు బీమా కింద ఇద్దరు రైతుల కుటుంబాలకు రూ.10 లక్షలు అందజేసినట్లు వివరించారు. 285 మంది రైతులకు రైతు రుణమాఫీ కింద రూ.2.49 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. 95 మంది రైతులకు సన్న వడ్లకు రూ.500 బోనస్ చొప్పున రూ.38 లక్షలు అందాయన్న మంత్రి.. గ్రామంలో 136 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. భూ భారతి కింద 24 మంది సమస్యలను పరిష్కరించమన్నారు. 29 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించామని వెల్లడించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్, HIV, బోదకాలు, తలసేమియా తదితర బాధితులకు సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేయడానికి ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని, ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. గౌరవెల్లి కాలువలకు భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పారు.ఎల్‌ఎండీ నుంచి వచ్చే నీటి ప్రాజెక్టు చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని, ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఫైల్ పంపించామని, త్వరలోనే అనుమతి వస్తుందని తెలిపారు. ఎంఎంఆర్ కింద ఆగిపోయిన పనులకు కూడా త్వరలోనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

వర్షాభావ పరిస్థితుల్లో నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతి చుక్క నీటిని సంరక్షించుకోవాలని మంత్రి సూచించారు. జలసిరి కార్యక్రమం ద్వారా బోర్‌వెల్ ఇంజెక్షన్ పాయింట్లు, ఇళ్లపై నుంచి వచ్చే వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.వర్షాలు తక్కువగా ఉన్నందున రైతులు వరి సాగు చేయకుండా ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎరువుల వినియోగం, యాప్ ద్వారా ఆన్‌లైన్ విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఆయిల్‌పామ్ సాగును పెద్దఎత్తున చేపట్టాలని మంత్రి సూచించారు. 200 ఎకరాల ఆయిల్‌పామ్ సాగు పూర్తి చేసిన గ్రామ పంచాయతీలకు అభివృద్ధి పనుల కోసం రూ.5 లక్షలు అందిస్తామని తెలిపారు. గ్రామాల్లో స్టీల్ బ్యాంకుల వినియోగాన్ని పెంచాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.

గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి

దుద్దెనపల్లి–మొగిలిపల్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ.3.56 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం స్లాబ్ పూర్తయిందని, జిమ్ కూడా మంజూరు చేసినట్లు వెల్లడించారు. గ్రామ సమైక్య భవనాలు కూడా మంజూరు చేసినట్లు తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, కొత్తగా నిర్మిస్తున్న ప్రతి పనిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రత్యక్ష అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలని కోరారు. అయితే వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం సీజనల్ వ్యాధులు తగ్గినప్పటికీ, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలి

ప్రజలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఇంటిపై సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ, బ్యాంకు రుణ సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యుత్ మరమ్మతుల కోసం కరెంట్ నిలిపివేయాల్సి వచ్చినప్పుడు ముందుగా గ్రామ ప్రజలకు సమాచారం ఇచ్చిన తర్వాతే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

173 గ్రామాల్లో “పల్లె పల్లెకు పొన్నం అన్న”

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి నిరంతర ప్రక్రియ. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం” అని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 173 గ్రామాల్లో “పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమం ద్వారా పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని తెలిపారు.“దుద్దెనపల్లి గ్రామంలో నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అందించాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం” అని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, గ్రామ సర్పంచ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>