ఉపాధి కూలీలకు ‘ఆన్‌లైన్’ కష్టాలు.. పని చేసినా దక్కని కూలీ!

కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో వేసవి మొదలవ్వడంతో వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ బాట పట్టారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి హామీ పథకం (VB-G RAM G) పేరు మార్పుతోపాటు అనేక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అక్రమాలను నివారించి పారదర్శకతను పెంపొందించాలనే లక్ష్యంతో ఆన్‌లైన్ హాజరును ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అనే యాప్ ద్వారా కూలీలు ప్రతిరోజూ రెండు సార్లు ఫొటోతో కూడిన హాజరువేయాల్సి ఉంటుంది. ఇదే కొందరు కూలీల పాలిట శాపంగా మారింది. యాప్ కూలీలను గుర్తించడంలో ఆలస్యం అవుతుందనే ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ సమస్య ప్రధానంగా ఆధార్ అప్డేట్ చేసుకొని వారిలో ఎక్కువగా కనిపిస్తుందని ఫీల్డ్ అసిస్టెంట్లు చెప్తున్నారు.

ఉపాధి హామీ కూలీ పనులు చేసేది నిరక్షరాస్యులు. కాబట్టి వీరికి ఆధార్ అప్డేట్ చేసుకోవాలనే అవగాహన ఉండటం లేదు. దీంతో పాత ఆధార్‌తోనే పనులకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 4 గంటలే పని చేసే అవకాశం కల్పించింది. అయినప్పటికీ ఫేస్ రికగ్నేషన్ యాప్ మొరాయించడంతో వీరు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ ఫీల్డ్‌లోనే ఉంటున్న పరిస్థితి నెలకొంది. ఒక్కోసారి యాప్ (APP) పనిచేయని కారణంగా పని చేసిన కూలీలకు కూడా మాస్టర్ పడటం లేదని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

మరోపక్క ఆధార్ ఆధారిత చెల్లింపులు కూడా గ్రామీణుల పట్ల శాపంగా మారాయి. ఉపాధి హామీ కూలీలకు చెల్లించే వేతనాలు బ్యాంక్, పోస్ట్ ఆఫీసుల్లో క్రెడిట్ అవుతాయి. అంటే వీరికి అక్కడ అకౌంట్ ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతాయి. అయితే గ్రామాల్లో ఉండే కొంత మంది మహిళలకు, వృద్ధులకు ఆధార్ కార్డు ఉంటుంది. కానీ ఫోన్ నెంబర్ ఉండటం లేదు. దీంతో అకౌంట్ ఓపెన్ కాక కొంత మంది గ్రామీణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొందరికి అకౌంట్ ఓపెన్ అయినా బ్యాంక్ ఖాతాలో పేరుకి, ఆధార్ కార్డులో పేరుకి అక్షరం తేడా ఉన్నా డబ్బులు అందడం లేదు. కాబట్టి ప్రభుత్వం ఆన్‌లైన్ హాజరు, ఆధార్ ఆధారిత చెల్లింపులకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని కూలీలు కోరుతున్నారు.

చాలా ఆలస్యమవుతోంది.

‘‘ఫేస్ రికగ్నిషన్ యాప్ మొరాయించడం వల్ల నాలుగు గంటల్లో పూర్తి కావాల్సిన పని తొమ్మిది గంటలు పడుతోంది. ఉదయం 11 గంటల వరకూ పని ముగించుకొని ఇళ్లు చేరాల్సిన మేం సాయంత్రం 3 గంటల వరకు ఉండాల్సి వస్తుంది. ఫొటో అప్డేట్ కాకపోతే ఆ రోజు కూలీ పని చేసినా రికార్డుల్లో మాస్టర్ నమోదు కావడం లేదు. దీంతో రోజంతా కష్టపడ్డా నయాపైసా రాదు’’

       – రామ్మోహన్ రెడ్డి, ఉపాధి కూలీ, బూర్గంపాడు

Read Also: అడ్డమైన హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: RSP

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>