మార్కెట్‌లో జోరుగా నాన్-ట్రేడ్ సిమెంట్ హవా.. నాణ్యతపై ప్రశ్నలు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర చిన్నపాటి అభివృద్ధి పనుల్లో నాన్-ట్రేడ్ సిమెంట్ (Non-Trade Cement) వినియోగం పెరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ మార్కెట్‌లో విక్రయించే ట్రేడ్ సిమెంట్‌తో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తుండటంతో కొందరు గుత్తేదారులు నాన్-ట్రేడ్ సిమెంట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.

నాన్-ట్రేడ్ సిమెంట్ అంటే ఏమిటి?

నాన్-ట్రేడ్ సిమెంట్ అనేది సాధారణ రిటైల్ మార్కెట్‌లో విక్రయించే ట్రేడ్ సిమెంట్‌కు భిన్నంగా, ప్రధానంగా పెద్ద ప్రాజెక్టులు, బల్క్ కొనుగోళ్ల కోసం సరఫరా చేసే సిమెంట్. ట్రేడ్ సిమెంట్‌తో పోలిస్తే నాన్-ట్రేడ్ సిమెంట్ ధర తక్కువగా ఉండటంతో కొందరు కాంట్రాక్టర్లు వ్యయాన్ని తగ్గించుకునేందుకు దీనిని వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాంకేతిక ప్రమాణాలు పాటించకుండా వాడితే రోడ్ల మన్నిక దెబ్బతినే అవకాశం ఉందని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు.

నాణ్యత పరీక్షలు జరుగుతున్నాయా?

సీసీ రోడ్ల నిర్మాణంలో సిమెంట్‌తో పాటు ఇసుక, కంకర, నీటి నిష్పత్తి, కాంక్రీట్ క్యూరింగ్ వంటి అంశాలు కూడా కీలకం. అయితే క్షేత్రస్థాయిలో నాణ్యత పరీక్షలు, క్యూబ్ టెస్టులు, గ్రేడ్ తనిఖీలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్మల్ నియోజకవర్గంలోని సారంగాపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో కొత్తగా వేసే సీసీ రోడ్ల నాణ్యతపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై సంబంధిత శాఖ అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్లలో ఒప్పంద నిబంధనల ప్రకారం ఓపీసీ (ఆర్డినరీ పోర్ట్‌ల్యాండ్ సిమెంట్) వినియోగించాల్సి ఉండగా, కొన్ని చోట్ల పీపీసీ (పోర్ట్ ల్యాండ్ పోజోలానా సిమెంట్) ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నిర్మాణాల నాణ్యత, మన్నికపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా సీసీ రోడ్ల నిర్మాణంలో టెండర్ నిబంధనలు, ఏ రకం సిమెంట్ ఉపయోగించాలో స్పష్టంగా పేర్కొంటారు. అయినప్పటికీ వ్యయాన్ని తగ్గించేందుకు కొందరు కాంట్రాక్టర్లు ఓపీసీ స్థానంలో పీపీసీ సిమెంట్ వాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

కాంట్రాక్టర్ల పేరుతో నాన్‌ట్రేడ్ సిమెంట్ కొనుగోలు

గ్రామాల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల్లో నాన్‌ట్రేడ్ సిమెంట్ వినియోగిస్తున్నారు. సాధారణంగా పరిశ్రమల నుంచి కాంట్రాక్టర్ల పేరుతో తక్కువ ధరకు కొనుగోలు చేసే నాన్‌ట్రేడ్ సిమెంట్‌ను కొందరు సిమెంట్ డీలర్లు గ్రామాల్లో పనులు చేపడుతున్న గుత్తేదారులు, రాజకీయ నాయకులకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ ధరలో సిమెంట్ అందుబాటులో ఉండటం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుందని భావించి పలువురు దీని వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నాన్‌ట్రేడ్ సిమెంట్ వినియోగంపై సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించడం లేదని తెలుస్తుంది.

అధికారుల పర్యవేక్షణ అవసరం

ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా అమలు కావాలంటే నిర్మాణ సామగ్రిపై నిరంతర తనిఖీలు అవసరం. పనులు పూర్తయ్యే వరకు సంబంధిత ఇంజినీర్లు, అధికారులు పర్యవేక్షణ పెంచి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>