Mobile Popup Ad
Mobile Popup Ad

అమ‌రావ‌తికి తెలంగాణవాదుల‌ విగ్ర‌హాలు తీసుకొస్తాం: రాణి రుద్ర‌మ రెడ్డి

క‌లం, వెబ్ డెస్క్: హైద‌రాబాద్‌లో ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌తో ఏపీలో సైతం తెలంగాణ‌వాదుల విగ్ర‌హాలు పెట్టాల‌న్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ యంగ్ థింక‌ర్స్ ఫోరం అమ‌రావ‌తిలో ప్రొఫెస‌ర్ జ‌య శంక‌ర్ విగ్ర‌హానికి స్థ‌లం కేటాయించాల‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబుకు లేఖ రాసింది. తాజాగా అమ‌రావ‌తి (Amaravati)లో తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యక్తులు, సాహితీవేత్త‌ల‌ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ నాయ‌కురాలు రాణీ రుద్రమ రెడ్డి (Rani Rudhrama Reddy) సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. కళలకు, రాజకీయాలకు ప్రాంతీయ విభేదాలు లేవని రాణీ రుద్ర‌మ‌ పేర్కొన్నారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు, మహాకవి దాశరథి, ప్రముఖ నటుడు కాంతారావు, భాగవత కర్త బమ్మెర పోతనల విగ్రహాలను కృష్ణా నది ఒడ్డున లేదా సచివాలయ పరిసరాల్లో ప్రతిష్టించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దాదాపు వెయ్యి మంది తెలంగాణ కవులు, కళాకారులతో కలిసి తామే విగ్రహాలను తీసుకొస్తామ‌ని, చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా వీటిని ఆవిష్కరించుకుంటామని ఆమె వెల్ల‌డించారు.

హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహం, రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాలు వేరైనా మనమంతా ఒక్కటే అనే స్ఫూర్తిని చాటారని రాణీ రుద్రమ గుర్తు చేశారు. అదే రీతిలో అమరావతిలోనూ తెలంగాణ వైతాళికులకు చోటు కల్పించి ఆ స్ఫూర్తిని కొనసాగించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక చొరవ తీసుకుని ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఆమె కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావాన్ని, సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేసేందుకు ఈ చర్య ఎంతో దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. హైద‌రాబాద్‌లో ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ అనంత‌రం.. ఏపీలో తెలంగాణ ప్ర‌ముఖుల‌ విగ్ర‌హాల ఏర్పాటుపై వ‌రుస లేఖ‌లు, విజ్ఞప్తులు రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>