కలం, వెబ్‌డెస్క్: డెబ్బై ఏళ్ల స్వతంత్ర భారతంలో.. వంద కోట్లకు పైగా భారతీయులకు పేదల బండి అనగానే గుర్తొచ్చేది రైలు. కానీ, దాని వెంటే గుర్తొచ్చేవీ ఉన్నాయి. అపరిశుభ్ర బోగీలు.. కంపుకొట్టే మరుగు దొడ్లు.. కిక్కిరిసిన బోగీలు.. చిరిగిన సీట్లు.. వెలగని లైట్లు.. తిరగని ఫ్యాన్లు.. నత్తను తలపించే వేగం.. వేళాపాళా లేని రాకపోకలు.. గంటలు, రోజుల తరబడి ప్రయాణికుల ఎదురుచూపులు.. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ప్రస్తుతం కాలం మారింది.. ప్రపంచం అభవృద్ది పథంలో పరుగులు పెడుతోంది.. అన్నింటిలో మార్పులు వస్తున్నాయి.. అదే ప్రభావం భారతీయ రైల్వేపై కనిపించింది.. అంతే.. వేళ తప్పని, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు ‘వందే భారత్’ (Vande Bharat) ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఇదే వందే భారత్ మరిన్ని ఆధునిక సొబగులు అందుకొని స్లీపర్ రూపంలో మన ముందుకొచ్చింది. అన్ని టెస్ట్‌లూ, టెస్ట్ రన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకొని అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు (Vande Bharat Sleeper) కోల్‌కతా – గువాహటి నగరాల మధ్య ఈ నెలలో పరుగులు తీయనుంది. ఈ క్రమంలో వహ్వా అనిపించే వందే భారత్ స్లీపర్ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం..
అదిరే స్పీడు.. అనువైన బెర్త్‌లు..
సాధారణ వందే భారత్ రైళ్ల స్పెషల్.. టైమ్ టు టైమ్ నడవడం. అయితే, ఇందులో ఓన్లీ సీటింగ్ మాత్రమే ఉండేది. బెర్త్‌లు ఉండేవి కావు. అలాగే మాక్సిమం స్పీడ్ గంటకు 130 కి.మీ. రెండేళ్ల కిందట ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తక్కువ కాలంలోనే వీటికి ప్రజల్లో విపరీత ఆదరణ పెరిగింది. దీంతో రెండేళ్లలోనే ఏకంగా 160కి పైగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా, బెర్త్‌లతో స్లీపర్ సర్వీసులు ఉంటే బాగుంటుందనే ఆలోచనతో భారతీయ రైల్వే వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) సర్వీసులు తెచ్చింది. ఇందులో అన్నీ ప్రత్యేకతలే.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్పీడ్. దీని గరిష్ఠ వేగం గంటకు 180 కి.మీ. ఈ వేగంలో వెళతున్నప్పటికీ ఎలాంటి కుదుపులూ లేకుండా అత్యాధునిక సస్పెన్షన్ వ్యవస్థను అమర్చారు. టెస్ట్ రన్లో ఒక బోగీలో కొన్ని నీళ్ల గ్లాసులను ఒకదాని మీద ఒకటి ఉంచగా, వాటిలోని నీరు తొణకలేదు. ఇదే విషయాన్ని చెప్తూ రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
బయో టాయిలెట్లు.. బేబి కేర్ ఏరియాలు..
కోచ్‌లన్నీ యూరోపియన్ మోడల్లో తయారైనవే. బోగీల్లోని సౌకర్యాలు చూస్తే వహ్వా అనాల్సిందే. బెర్త్‌లన్నీ అత్యంత సౌకర్యవంతంగా ఏర్పాటుచేశారు. సాధారణ రైళ్లలో పై బెర్త్ల్లోకి వెళ్లాలంటే కొన్ని ఇబ్బందులు తప్పవు. కానీ, వీటిలో అలాంటి సమస్య లేదు. సులభంగా పై బెర్త్‌లకు వెళ్లొచ్చు. అలాగే రాత్రిళ్లు తక్కువ కాంతి కలిగిన లైటింగ్ సిస్టమ్ ఉంది. టీవీలు, సీసీ కెమెరాలు ఉన్నాయి. భోజనం చేయడానికి అనువైన ప్యాంట్రీ ఉంది. విమానాల్లో కనిపించే బయో–వ్యాక్యూమ్ టాయిలెట్లు ఈ రైళ్లలో ఉన్నాయి. దివ్యాంగులు సైతం సులభంగా ఉపయోగించుకునేలా వీటిని తీర్చిదిద్దారు. అలాగే చిన్న పిల్లల కోసం బేబీ కేర్ ఏరియా ఉంది. ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీల్లో స్నానానికి వేడి నీళ్లతో పాటు షవర్ సౌకర్యమూ ఏర్పాటు చేశారు.
భద్రత భేష్..
భద్రత విషయంలోనూ ఢోకా లేదు. ప్రమాదాల సమయంలో అత్యంత సమర్థంగా పనిచేసే అత్యాధునిక కవచ్ వ్యవస్థ అమర్చారు. కోచ్లన్నిటికీ ఆటోమేటిక్ తలుపులు ఉన్నాయి. బోగీల్లో నాణ్యమైన గాలి, స్థిరమైన ఉష్ణోగ్రతలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి కోచ్‌లో రీడింగ్ లైట్లు, పవర్ చార్జింగ్ పాయింట్లు, మడవడానికి వీలయిన స్నాక్ టేబుళ్లు ఉన్నాయి. రైళ్లు నిర్దేశిత స్టేషన్లో ఆగినప్పుడు డోర్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. అలాగే అత్యవసర సమయంలో లోకోమోటివ్ పైలట్‌ను సంప్రదించడానికి వీలుగా కమ్యూనికేషన్ ఏర్పాట్లు ఉన్నాయి. కాగా, రాబోయే కొన్నేళ్లలో వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) ట్రైన్లను 200 వరకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ రైళ్ల తయారీలో బీఈఎంఎల్(భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్), ఇంటెగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ పాత్ర కీలకం.
ధరలు ఇలా..
కోల్‌కతా–గువాహటి మధ్య దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణానికి ఒక గంట 15 నిమిషాలు పడుతుంది. అదే ట్రైన్లో అయితే సుమారు ఒకరోజు ప్రయాణం. విమానంలో ప్రయాణానికి రూ.6వేలు టికెట్ ధర ఉంది. కొత్తగా తీసుకొచ్చిన వందే భారత్‌లో ఫస్ట్ ఏసీ రూ.3,600; ఏసీ 2 టైర్ రూ.3,000; ఏసీ 3 టైర్ రూ.2,300 టికెట్ ధరగా నిర్ణయించారు. ఇందులోనే భోజనానికి ఛార్జ్ చేస్తారు.
Read Also: వచ్చే ఏడాది ఆగస్టు 15న బుల్లెట్ రైలు.. మొదటి సర్వీస్ వీటి మధ్యే
Follow Us On: Instagram


