కలం, స్పోర్ట్స్ : కెరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2026) 2026 సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీన టోర్నీ ఘనంగా ప్రారంభం కానుందని నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఈసారి రికార్డు స్థాయిలో మొత్తం ఎనిమిది దేశాల్లో మ్యాచ్‌లు నిర్వహించబోతుండటం విశేషం. ఈ సీజన్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్‌లోని చారిత్రాత్మక ‘ఆర్నోస్ వేల్’ స్టేడియం తొలిసారిగా సి.పి.ఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. గతంలో 36 అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు, 2024 టీ20 ప్రపంచకప్‌కు వేదికైన ఈ గ్రౌండ్, స్పిన్ బౌలింగ్‌కు అనుకూలిస్తుందని పేరు పొందింది. లీగ్ పరిధిని విస్తరించడంలో భాగంగా కొత్త వేదికలను ఎంచుకోవడం తమ దీర్ఘకాలిక లక్ష్యమని సి.పి.ఎల్ సి.ఈ.ఓ పీట్ రస్సెల్ వెల్లడించారు.
అక్కడి అభిమానుల ఉత్సాహం మధ్య మ్యాచ్‌లు నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మొత్తం ఏడు జట్లు తలపడే ఈ టోర్నీ (CPL 2026) లో ‘జమైకా కింగ్స్‌మెన్’ అనే కొత్త ఫ్రాంచైజీ అరంగేట్రం చేస్తోంది. ఆగస్టు 7న ఆర్నోస్ వేల్ స్టేడియంలో జమైకా కింగ్స్‌మెన్, యాంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ మొదలవుతుంది. ఆ తర్వాత ఆగస్టు 8న కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ వర్సెస్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, ఆగస్టు 9న యాంటిగ్వా ఫాల్కన్స్ వర్సెస్ సెయింట్ లూసియా కింగ్స్ మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి.
సెప్టెంబర్ 20 వరకు సాగే ఈ టోర్నీ చివరి దశలో ఇంగ్లాండ్‌లో జరిగే ‘ద హండ్రెడ్’ లీగ్ ప్రారంభం కానుంది. దీనివల్ల నికోలస్ పూరన్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ వంటి స్టార్ ఆటగాళ్లు సి.పి.ఎల్ ముగింపు దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇక నిర్ణయాత్మకమైన ఎలిమినేటర్, క్వాలిఫైయర్లతో పాటు ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 16 నుండి 20 వరకు కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరుగుతుంది. ఐదుసార్లు విజేతగా నిలిచిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెగా టోర్నీ, కెరీబియన్ దీవుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

