వైభవ్ సూర్యవంశీ ‘ప్యూర్ మ్యాజిక్’: ఇర్ఫాన్ ఫిదా !

కలం, స్పోర్ట్స్‌ : రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌పై మాజీ భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్ ఒక ‘ప్యూర్ మ్యాజిక్’ అంటూ ఆయన తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో కొనియాడారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలవడం నమ్మశక్యం కాని విషయమని, ఇలాంటి విన్యాసాన్ని తాము ముందెన్నడూ చూడలేదని పఠాన్ పేర్కొన్నారు. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో జరిగిన ఈ కీలక పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆ తర్వాత మైదానంలో వైభవ్ సూర్యవంశీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తాజ్‌పూర్‌లో జన్మించిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మ్యాచ్ మూడో ఓవర్ నుంచే తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ వేసిన ఓవర్లోనే ఒక ఫోర్, మూడు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాతి ఓవర్లో మరో మూడు సిక్సర్లు బాదిన వైభవ్, కేవలం 16 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

చివరకు వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 97 పరుగులు చేసి అవుటయ్యాడు. కేవలం మూడు పరుగుల తేడాతో ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన క్రిస్ గేల్ సెంచరీ రికార్డును సమం చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌లో బాదిన సిక్సర్లతో ఈ సీజన్‌లో అతని మొత్తం సిక్సర్ల సంఖ్య 65కి చేరింది. దీంతో ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అతను సరికొత్త చారిత్రక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>