కలం, వెబ్ డెస్క్: భారత గోల్ఫ్ (Indian Golf) ముఖచిత్రం మారుతోంది. ఆ మార్పుకు కారణం కపిల్ దేవ్! స్పాన్సర్లు, భారీ ప్రైజ్ మనీ, అంతర్జాతీయ టోర్నీలతో ఇండియన్ గోల్ఫ్ ఇప్పుడు కొత్త దూకుడు చూపిస్తోంది. 2024లో పీజీటీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కపిల్ దేవ్ (Kapil Dev).. గోల్ఫ్‌కు ఫుల్ స్వింగ్ ఇచ్చారని డీపీ వరల్డ్ పీజీటీఐ సీఈఓ అమన్‌దీప్ జోహల్ చెప్పారు. కేవలం ఏడాదిలోనే టోర్నీల సంఖ్య, ప్రైజ్ మనీలో దాదాపు 60 శాతం వృద్ధి వచ్చిందని వెల్లడించారు.
డీపీ వరల్డ్‌తో పెద్ద భాగస్వామ్యం కుదరడంతో.. ఇప్పుడు అమూల్, యాక్సిస్ బ్యాంక్, కాంపా, అమృతాంజన్ లాంటి బ్రాండ్లు కూడా గోల్ఫ్ వైపు చూస్తున్నాయని తెలిపారు. ఇక్కడితో కథ ఆగలేదు.. ప్రైజ్ మనీ పెరిగితే ప్రపంచ స్థాయి ఆటగాళ్లు భారత్‌కు వస్తారని, దాంతో వరల్డ్ ర్యాంకింగ్ పాయింట్లు కూడా పెరుగుతాయని జోహల్ చెప్పారు. అదే భారత ఆటగాళ్లకు ఒలింపిక్స్, ఆసియా గేమ్స్ దారి మరింత సులభం చేస్తుందని వివరించారు.
అక్టోబర్‌లో ఢిల్లీ గోల్ఫ్ క్లబ్‌లో జరగనున్న డీపీ వరల్డ్ ఇండియా ఛాంపియన్‌షిప్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి టోర్నీలు పెరిగితే ఇండియన్ గోల్ఫ్ గ్లోబల్ లెవెల్‌కు చేరుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు గోల్ఫ్‌ను మెట్రో నగరాలకే పరిమితం చేయకుండా చిన్న పట్టణాలకు తీసుకెళ్తున్నారు. ఛత్తీస్‌గఢ్, వారణాసిలో టోర్నీలు ప్లాన్ చేశారు. స్కూల్ పిల్లలకు గోల్ఫ్ నేర్పించే కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి.
ప్రతి ఏడాది వెయ్యి మందికి గోల్ఫ్ నేర్పితే.. వచ్చే పదేళ్లలో వేలాది కొత్త గోల్ఫర్లు తయారవుతారని జోహల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక భారత్‌ను అంతర్జాతీయ గోల్ఫ్ హబ్‌గా మార్చే ప్రయత్నాల్లో భాగంగా.. కొరియా, జపాన్, థాయ్‌లాండ్ టూర్ ఆటగాళ్లకు కూడా భారత్‌లో ఆడేలా ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు. ఒకప్పుడు పరిమిత వర్గాల ఆటగా కనిపించిన గోల్ఫ్.. ఇప్పుడు కపిల్ దేవ్ నాయకత్వంలో భారీ మార్పుల దిశగా పరిగెడుతోంది. డబ్బు, టోర్నీలు, ప్రపంచ గుర్తింపు.. ఇండియన్ గోల్ఫ్ గేమ్ ప్లాన్ పూర్తిగా మారిపోయింది.

