కలం, వెబ్ డెస్క్ : కర్ణాటక (Karnataka) రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా మంత్రివర్గాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. ఈ భేటీలో అధికారికంగా రాజీనామా సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పార్టీ హైకమాండ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య భావోద్వేగంగా స్పందించారు. “నేను మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా.. నాకు ఎలాంటి బాధ లేదు. పార్టీ కోసం, ప్రజల కోసం ఎప్పుడూ పనిచేశాను. మీ అందరి సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు.
తన రాజకీయ ప్రయాణంలో ప్రజలు ఇచ్చిన ప్రేమ, మద్దతు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చిన పార్టీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే, “హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తాను. ప్రజాసేవే నా జీవిత లక్ష్యం” అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, సిద్ధరామయ్య అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ పరిణామంపై భావోద్వేగానికి గురయ్యారు. ఆయన నాయకత్వంలో అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

