కలం, వెబ్‌డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) స్టార్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) వీరవిహారం చేశాడు. బుడ్డోడి దెబ్బకు ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు కళ్లుతేలేశారు. సెంచరీ చేయడంలో క్రిస్ గేల్ రికార్డ్‌ను అధిగమిస్తాడనుకున్న సమయంలో వైభవ్ వికెట్ పడటంతో రాజస్థాన్ పరుగుల సునామీకి బ్రేకులు పడ్డాయి. దాంతో ఆరెంజ్ ఆర్మీ ఊపిరిపీల్చుకుంది. అప్పటి వరకు బంతి వేస్తే బౌండ్రీ అవతల చూపించాడు వైభవ్. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన జురెల్ కూడా వైభవ్ ఊపును కొనసాగించాడు. కానీ హింగే బౌలింగ్‌లో వికెట్ కోల్పోయి వెనుదిరిగాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఇక ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో ప్రఫుల్ హింగే మరోసారి మెరిశాడు. కీలక వికెట్లు పడగొట్టి రాజస్థాన్ స్పీడుకు కాస్తంత బ్రేకులు వేశాడు. వైభవ్ వికెట్‌ను తీసి రాజస్థాన్‌కు భారీ షాక్ ఇచ్చాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగారు. జైస్వాల్ నెమ్మదిగా ఆడుతూ 29 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసి శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కానీ, మరో ఎండ్ లో వైభవ్ సూర్యవంశీ మాత్రం కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్ల సాయంతో 334.48 స్ట్రైక్ రేట్‌తో 97 పరుగులు చేసి సెంచరీకి చేరువయ్యాడు. ఈ దశలో ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో స్మరణ్‌కు క్యాచ్ ఇచ్చి వైభవ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆయన 21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు పూర్తి చేసుకుని, హింగే బౌలింగ్‌లోనే నితీష్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి క్లాసెన్ పట్టిన క్యాచ్‌తో హింగేకే మూడో వికెట్‌గా దొరికిపోయాడు.
మిగిలిన బ్యాటర్లలో డోనవన్ ఫెరీరా 9 బంతుల్లో 1 ఫోర్‌తో 12 పరుగులు చేసి శివాంగ్ కుమార్, ఇషాన్ కిషన్ల చేతిలో రనౌట్ అయ్యాడు. దసన్ శనక 3 బంతుల్లో 1 ఫోర్ కొట్టి 5 పరుగుల వద్ద మలింగ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రవీంద్ర జడేజా 9 బంతుల్లో 1 ఫోర్‌తో 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జోఫ్రా ఆర్చర్ 5 బంతుల్లో 1 ఫోర్ కొట్టి 4 పరుగుల వద్ద నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. నాండ్రే బర్గర్ 1 బంతికి 1 పరుగు చేసి మలింగ, ఇషాన్ కిషన్ల రనౌట్ రూపంలో అవుట్ కాగా, సుశాంత్ మిశ్రా 3 బంతుల్లో 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. ఎక్స్‌ట్రాల రూపంలో 6 పరుగులు (బైస్ 2, నోబాల్ 1, వైడ్లు 3) లభించాయి. దీంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది.
హైదరాబాద్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆయన తన 4 ఓవర్లలో వికెట్ ఏమీ తీయకుండా 16.00 ఎకానమీతో అత్యధికంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. ఇషాన్ మలింగ కట్టడిగా బౌలింగ్ చేస్తూ 4 ఓవర్లలో 9 డాట్ బాల్స్‌తో 40 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. సకిబ్ హుస్సేన్ 3.6 ఓవర్లలో వికెట్ లేకుండా 52 పరుగులు ఇచ్చాడు. ఇక ప్రఫుల్ హింగే భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ జట్టుకు అవసరమైన 3 ముఖ్యమైన వికెట్లు (వైభవ్, జురెల్, పరాగ్) పడగొట్టాడు. ఆయన 4 ఓవర్లలో 1 నోబాల్, 1 వైడ్‌తో కలిపి 54 పరుగులు ఇచ్చి 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. శివాంగ్ కుమార్ 2 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయగా, నితీష్ కుమార్ రెడ్డి అత్యంత కట్టడిగా బౌలింగ్ చేస్తూ 2 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీ ముందు 244 పరుగుల భారీ లక్ష్యం ఉంది. దీనిని ఎస్ఆర్‌హెచ్ ఏమాత్రం ఛేజ్ చేస్తుందో చూడాలి.

