వైభవ్ వీరవిహారం.. రాజస్థాన్ చేతిలో లక్నో చిత్తు

కలం, వెబ్ డెస్క్:  రాయ్‌పూర్‌లో రాజస్థాన్ తమ ఆధిపత్యాన్ని కనబరిచింది. లక్నో సూపర్ జయంట్స్‌ను చిత్తు చిత్తు చేసింది. లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ 96 పరుగులతో చెలరేగినా.. అతడి శ్రమ వృధా అయింది. రాజస్థాన్ బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi), జురేల్ మైదానంలో పరుగుల వరద పారించాడు.

15ఏళ్ల బుడ్డోడు 93 పరుగులతో లక్నో బౌలర్లపై వీరవిహారం చేశాడు. దీంతో లక్నో ఇచ్చిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో ఛేదించేసింది. ఈసారి రెండు జట్ల బౌలర్లు తమ సత్తా చాటుకోవడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఒక్కరంటే ఒక్కరు కూడా బ్యాటర్లను కట్టడిచేయలేకపోయారు. పైగా పరుగులను భారీగా సమర్పించుకున్నారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

వీరిద్దరూ తొలి వికెట్‌కు కేవలం 8.2 ఓవర్లలోనే 109 పరుగుల మెరుపు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జోష్ ఇంగ్లిస్ కేవలం 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి యశ్ రాజ్ పుంజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ 11 బంతుల్లో 2 సిక్సర్లతో 16 పరుగులు చేసి అదే బౌలర్ చేతిలో ఫెరీరాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు ఓపెనర్ మిచెల్ మార్ష్ వన్‌మ్యాన్ షోతో చెలరేగిపోయాడు.

సెంచరీకి చేరువైన తరుణంలో యశస్వి జైస్వాల్ మెరుపు త్రోకు మార్ష్ దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. మార్ష్ మొత్తం 57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి ఇన్నింగ్స్ వెన్నెముకగా నిలిచాడు. కెప్టెన్ రిషభ్ పంత్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి ఆఖరి ఓవర్లో రనౌట్ కాగా, ఆయుష్ బదోని గోల్డెన్ డకౌట్ (0) అయ్యాడు. అబ్దుల్ సమద్ పరుగులు ఏమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో యశ్ రాజ్ పుంజా 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 39 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. సుశాంత్ మిశ్రా (4 ఓవర్లలో 46), సందీప్ శర్మ (3 ఓవర్లలో 43), బ్రిజేష్ శర్మ (4 ఓవర్లలో 44) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.1 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ ఓపెనర్లు కెప్టెన్ యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ లక్నో బౌలర్లను చీల్చిచెండాడుతూ తొలి వికెట్‌కు 6.3 ఓవర్లలోనే 75 పరుగులు జోడించారు. జైస్వాల్ 23 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 పరుగులు చేసి ఆకాష్ సింగ్ బౌలింగ్‌లో రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల సునామీ సృష్టించాడు. కేవలం 38 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ 7 ఫోర్లు, ఏకంగా 10 గగనతాల సిక్సర్లతో 244.73 స్ట్రైక్ రేట్‌తో 93 పరుగులు చేసి లక్నోకు మ్యాచ్‌ను పూర్తిగా దూరం చేశాడు. మొహసిన్ ఖాన్ బౌలింగ్‌లో సమద్‌కు క్యాచ్ ఇచ్చి వైభవ్ అవుటయ్యాడు. అనంతరం ధ్రువ్ జురెల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. లూవాన్-డ్రే ప్రిటోరియస్ 6 బంతుల్లో 7 పరుగులు చేసి ఆయుష్ బదోని త్రోకు రనౌట్ కాగా, డోనోవన్ ఫెరీరా 10 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 16 పరుగులు చేసి నాటౌట్‌గా ఉంటూ మ్యాచ్ ముగించాడు. లక్నో బౌలర్లలో మొహసిన్ ఖాన్ 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా, ఆకాష్ సింగ్ 3 ఓవర్లలో 54 పరుగులకు ఒక వికెట్ పడగొట్టాడు. మయాంక్ యాదవ్ (4 ఓవర్లలో 50), ప్రిన్స్ యాదవ్ (4 ఓవర్లలో 43), దిగ్వేష్ రాఠీ (4 ఓవర్లలో 38) వికెట్లేమీ తీయలేకపోయారు. షాబాజ్ అహ్మద్ వేసిన ఏకైక బంతికే ఫెరీరా సిక్సర్ బాదడంతో రాజస్థాన్ విజయం ఖరారైంది

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>