కలం, వెబ్‌డెస్క్: ధాన్యం సేకరణ(Paddy Procurement)లో సమస్యలు పరిష్కరించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సీజన్‌లోనూ ధాన్యం సేకరణలో అనేక సవాళ్లు ఎదురవుతున్న విషయం తెలిసిందే. సకాలంలో ధాన్యం సేకరణ చేయకపోవడం.. రైతులకు డబ్బులు సమయానికి అందకపోవడం వంటి సవాళ్లు ఎదరవుతున్నాయి. రోజుల తరబడి కొనుగోళ్లు కేంద్రాల్లో ధాన్యం నిలువ ఉంచాల్సి వస్తోంది. అదే సమయంలో వర్షాలు పడితే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించుకొనే దశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025–26లో వరి ధాన్యం సేకరణ సజావుగా, ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేలా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఉత్తమ్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు.
రాష్ట్రంపై ఆర్థిక భారం
‘వరి ధాన్యం సేకరణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆర్థిక భారం మోయాల్సి వస్తోంది. ఆ భారం తగ్గించేలా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా సేకరణ, నిల్వ, రవాణా, మిల్లింగ్ ఖర్చుల విషయంలో రాష్ట్రానికి సహకారం అందించండి’ అంటూ ఆయన లేఖలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ప్రస్తావించారు.
ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సమయానికి, పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం అత్యంత కీలకమని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం లేదా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం అవసరమని పేర్కొన్నారు. అలాగే ఎఫ్‌సీఐ, పౌర సరఫరాల శాఖల మధ్య సమర్థవంతమైన సహకారం ఉండేలా చూడాలని సూచించారు.
న్యాయమైన మద్దతు ధర కావాలి
రైతులకు న్యాయమైన మద్దతు ధర లభించేలా, ధాన్యం సేకరణ వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉందని, ఇందుకు కేంద్రం సహకరిస్తే ధాన్యం సేకరణ మరింత సాఫీగా జరిగే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: ఫ్లైట్ లో మహిళకు గుండెపోటు.. కాపాడిన మాజీ ఎమ్మెల్యే
Follow Us On: Sharechat


