కలం, వెబ్ డెస్క్: గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల ప్రక్రియపై ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సంబంధిత అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు. ఈ మీటింగ్ కి అధికారులు, ఇంజినీర్లు, ఏజెన్సీలు, ఇతర ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పూర్థిస్థాయి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు మరమ్మతుల ప్రక్రియపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రాజెక్టుపై చేయాల్సిన పరీక్షలు, సామాగ్రి, గడువులపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులపైనా సమీక్షించనున్నారు.
కాగా, ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలకు అనుగుణంగా పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు మరమ్మత్తుల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి, నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) ఆధ్యర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని చెప్పారు. నీటిపారుదల శాఖ, సీడబ్ల్యూపీఆర్ ఎస్, బ్యారేజీల నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టేషన్స్ తో టీమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పనిలో సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) సభ్యులు ఉండేలా చూడాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన పిల్లరే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజ్ ని అధ్యయనం చేయాల్సి ఉంటుందని.. వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని ఆదేశించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, ఆ సమయంలోనే ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగామారిన విషయం తెలిసిందే. పిల్లర్లను బాగు చేసి బ్యారేజీని వాడుకలోకి తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ ఇన్నాళ్ళుగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అసెంబ్లీలో సైతం పలుమార్లు ఈ అంశంపై చర్చలు కూడా జరిగాయి. అటు సుదీర్ఘ కాలం తరువాత కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలని రేవంత్ ప్రభుత్వం సైతం నిర్ణయం తీసుకుంది. వానాకాలం రాకముందే బ్యారేజీని మరమ్మతులు పూర్తి చేసి సాగు, తాగు నీటిని విడుదల చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతోంది.

