కలం, వెబ్ డెస్క్ : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల రద్దీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డులను సృష్టించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలైన 2023-24, 2024-25లో సగటున రోజుకు 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 2025-26 నాటికి ఆ సంఖ్య రోజుకు 73 వేలకు చేరుకుంది. గతంతో పోలిస్తే భక్తుల రాకలో 4.57 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది కాలంలో మొత్తం 2.67 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం ఒక అరుదైన మైలురాయిగా నిలిచింది.
భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. విశేషమేమిటంటే, ఏడాదిలో ఏకంగా ఆరు నెలల పాటు ప్రతి నెలా హుండీ ఆదాయం రూ.120 కోట్లకు పైగా నమోదు కావడం స్వామివారి చరిత్రలో ఇదే తొలిసారి. దర్శనాలే కాకుండా స్వామివారి ప్రసాదమైన లడ్డూ విక్రయాల్లో కూడా అద్భుతమైన వృద్ధి కనిపించింది. గత ఏడాదితో పోలిస్తే లడ్డూల విక్రయాలు 12.6 శాతం పెరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భక్తులకు సుమారు 13.95 కోట్ల లడ్డూలను పంపిణీ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. టీటీడీ (TTD) ప్రవేశపెట్టిన ఆధునిక సాంకేతికత, మెరుగైన క్యూ లైన్ నిర్వహణ వ్యవస్థల కారణంగానే భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ దర్శనాలు ఇంత వేగంగా సాధ్యమయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు.

