కలం, వెబ్ డెస్క్: తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ నిర్మించుకునేందుకు అనుమతించేలా మహారాష్ట్రను ఒప్పించాలని ప్రధాని మోదీని కోరినట్లు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రధాని మోదీని కలిసిన అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. సమ్మక్క సారక్క సాగర్ ప్రాజెక్టుకు వెంటనే ఎన్వోసీ జారీ చేయాలని కోరామన్నారు. ఇప్పటిదాకా పెట్టిన ఖర్చుల వివరాలను ప్రధానికి అందించామని, నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతుందనే విషయాన్ని కూడా చెప్పామన్నారు. సమ్మక్క సారక్క ప్రాజెక్టు అనుమతుల విషయమై త్వరలోనే ఛత్తీస్గఢ్ సీఎంను కలుస్తామన్నారు.
తీవ్ర ప్రభావం చూపుతున్న ఎల్ నినో..
తెలంగాణలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని.. వెంటనే కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని ప్రధాని మోదీని కోరినట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. భూ గర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయని.. రాబోయే రోజుల్లో మరింత తీవ్రమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశామన్నారు. కేంద్ర సంస్థలు ఇచ్చిన రిపోర్టులనే ప్రధాని మోదీకి అందించామని, ఇదొక ప్రకృతి విపత్తు అన్నారు. ఇక ఖేలో ఇండియా ప్రారంభోత్సవానికి కూడా ఆహ్వానించామని.. ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు. పీఎంకేవైఎస్ పథకం కింద మోయకుంట వాగు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.300 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.171 కోట్లు, చనకా కొరాటా ప్రాజెక్టుకు రూ.103 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు.

