కలం, వెబ్ డెస్క్ : ఈ నెల 11న జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ (Kishtwar Operation ) అటవీ ప్రాంతంలో విధుల్లో ఉన్న ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు రష్పాల్ కుమార్, బాబీ చంద్‌లను ఉగ్రవాదులు కాల్చి చంపి, వారి వద్ద ఉన్న సర్వీస్ ఆయుధాలను తీసుకెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు భారత బలగాలు రంగంలోకి దిగాయి. ఈ మేరకు కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు భారీ స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. దట్టమైన అటవీ ప్రాంతాలైన దచ్చన్, మడ్వా (మార్వా)లలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్ , అలాగే జమ్మూకశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
ప్రతికూల వాతావరణం, ఎత్తైన పర్వత శ్రేణుల నేపథ్యంలో ఉగ్రవాదుల కదలికలను పసిగట్టేందుకు భద్రతా దళాలు హెలికాప్టర్లు, అత్యాధునిక నిఘా డ్రోన్లను రంగంలోకి దించాయి. ఉగ్రమూకల ఆటకట్టించేందుకు బలగాలు ఈ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి జల్లెడ పడుతున్నాయి. మరోవైపు, ఈ ప్రాంతంలో సంచరిస్తున్న ముగ్గురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లను భద్రతా సంస్థలు విడుదల చేసి, వారి ఆచూకీ తెలిపిన వారికి భారీ నగదు బహుమతులు ప్రకటించాయి. స్థానిక ఓవర్‌గ్రౌండ్ వర్కర్లనెట్‌వర్క్‌పై కూడా నిఘా ఉంచి, ఉగ్రవాదులకు సహకరిస్తున్న అనుమానితులను అధికారులు విచారిస్తున్నారు.

