కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దెందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల పూర్తికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. దేవాదుల, ఎస్ ఎల్ బీసీ, సీతారమా ప్రాజెక్టులతో సరి సమానంగా పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు (Palamuru Irrigation Projects) పూర్తి చేస్తామన్నారు. సమృద్ధిగా సాగు నీరు, త్రాగు నీరు అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మద్యాహ్నం సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో కలసి మంత్రి ఉత్తమ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మణాల పురోగతిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మరో పదిహేను రోజుల్లో ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై పునఃసమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అందుకుగాను ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమగ్రమైన నివేదికలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున మట్టి పేరుకపోయి నీటి సామర్ధ్యం నిలువ 8 TMCల దిగువకు పడిపోయిందన్నారు. ప్రాజెక్టు పూడిక తీసి నీటి సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు వీలుగా డీఆర్ ఐపీ (DRIP)కు ప్రతిపాదనలు పంపించినట్లు చెప్పారు. చిన్న తరహా సాగునీటి చెరువులలో వర్షా కాలానికి ముందే పూడిక తీత పనులు చేపట్టాలని సూచించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90% పూర్తి అయ్యాయంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా సత్యదూరమని కొట్టిపారేశారు. ఆ ప్రచారం ముమ్మాటికీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టు ఆఫ్ టెక్ ను జూరాల నుండి శ్రీశైలం రిజర్వాయర్ కు మార్చడంతో తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి తొలి దశలో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణ పేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోని 1,226 గ్రామాలకు త్రాగునీరు అందిస్తామని చెప్పారు.

