కలం, వెబ్ డెస్క్: విజయ్ (Vijay) తమిళనాడు సీఎం అవబోతున్నాడని ఒక డైరెక్టర్ రెండేళ్ల కిందటే ఊహించి.. మూవీలో కారు నెంబర్ ప్లేట్ కూడా అలాగే తయారు చేయించాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే! ఆ డైరెక్టర్ వెంకట్ ప్రభు, చిత్రం పేరు ‘గోట్’. సీఎం విజయ్‌ను కలిసి.. అదే నెంబర్ ప్లేట్ బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘చరిత్ర సృష్టించారు. ఆలోచన నుంచి దూరదృష్టి వరకు సాగిన ఈ ప్రయాణం ఇది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే ఊహించిన చిత్రంలోని బహుమతిని ముఖ్యమంత్రి విజయ్‌ని కలిసి అందించడం ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నాడు.
పార్టీ పెట్టాక మొదటి మూవీ..
వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గోట్’. 2024లో దళపతి టీవీకే పార్టీ పెట్టిన కొద్ది రోజులకే ఇది విడుదలైంది. ఇందులో ఒక సీన్‌లో విజయ్ ఉపయోగించే కారు నెంబర్ ప్లేట్ TN07CM2026 అని ఉంటుంది. 2026లో విజయ్ సీఎం అవుతాడని వచ్చేలా దీన్ని వెంకట్ ప్రభు డిజైన్ చేయించారు. అది కాస్తా నిజమే కావడంతో ఈ నెంబర్ ప్లేట్‌నే గిఫ్ట్‌గా ఇవ్వడంతో ఒకింత షాకైన విజయ్.. నవ్వుతూ స్వీకరించి అభినందించారు.

