Mobile Popup Ad
Mobile Popup Ad

2027 చివరికల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తి: ఉత్తమ్

కలం, వెబ్ డెస్క్: దేవాదుల ఎత్తిపోతల పథకం (Devadula Project ) 2027 డిసెంబర్ నెల చివరికి పూర్తి చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ప్రకటించారు. 38.16 TMCల నీటితో హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు కరీంనగర్ జిల్లాలకు చెందిన 5.57 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం (JCRDLIS) పనుల పురోగతిపై శనివారం సచివాలయంలో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, సితక్కలతో కలసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2004-2005 లో అప్పటి కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో రూ.6,016 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకం నిర్మాణం గడిచిన బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురి కావడంతో అంచనా వ్యయం రూ.18,400 కోట్లకు పెరిగిందని వివరించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై రూ.14,422 కోట్లు ఖర్చు పెట్టామని మరో రూ.3,978 కోట్లతో 2027 డిసెంబర్ మాసంతానికి పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేసినట్లు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును మొత్తం మూడు దశలలో నిర్మాణం చేపట్టగా.. 16 ప్యాకేజిజీలుగా విభజించి నిర్మాణం పనులు చేపట్టినట్లు తెలిపారు. మొదటి దశ ద్వారా 1.23 లక్షల ఎకరాలకు రెండో దశ ద్వారా 1.93 లక్షల ఎకరాలకు మూడో దశ ద్వారా 2.39 లక్షల 3ఎకరాలకు సాగునీరు అందించాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.

ఆసియాలోనే అతి పొడవైన 49 కిలోమీటర్ల డీ-ఆకారపు సాగునీటి సొరంగం ఈ ప్రాజెక్టులో భాగమని మంత్రి ఉత్తమ్ వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 495.55 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేవాదుల ప్రాజెక్టు పనులు 87.70 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రధాన పంప్ హౌసులు, పైప్‌లైన్ వ్యవస్థలు, సొరంగ తవ్వకాల పనులు ఎక్కువగా పూర్తయ్యాయని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా తెలంగాణలోని అనేక ఎండబారిన గ్రామాలకు తాగునీటి లభ్యత కూడా గణనీయంగా మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>