కలం, కరీంనగర్ బ్యూరో: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు స్థానిక కోతి రాంపూర్‌లోని ముకుందలాల్ మిశ్రా భవన్ లో సీపీఎం కరీంనగర్ (CPM Karimnagar) నగర కార్యదర్శి గుడికందుల సత్యం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నగర కార్యర్శులు గుడికందుల సత్యం, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా నాయకులు జిందం ప్రసాద్ లు మాట్లాడారు. మైనర్ బాలికను అత్యాచారం చేసి గత ఎనిమిది రోజులుగా తప్పించుకు తిరుగుతున్న బండి భగీరథ్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన అధికారం, పలుకుబడిని ఉపయోగించి కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు. ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పోక్సో కేసులో నిందితుడిని తక్షణమే కోర్టుకు హాజరు పరిచి విచారణ జరిపించి జైలుకు పంపించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం సిట్ పేరుతో కాలయాపన చేస్తుందన్నారు. పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ తన కొడుకు అయినా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే అని ప్రగల్బాలు పలుకుతూ తన కొడుకును పోలీసులకు అప్పగించకుండా, కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. భగీరథ్ తప్పు చేయనప్పుడు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడని? కోర్టు ముందు హాజరై న్యాయ విచారణ ఎందుకు ఎదుర్కోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ భేటీ పడావో భేటీ బచావో నినాదాన్ని బండి సంజయ్ బేటా బచావో అనే విధంగా తన కొడుకును రక్షించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని తన రాజకీయ పలుకుబడితో చట్టాన్ని తనకు చుట్టాలుగా మలుచుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని లేదంటే వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రోజువారీ ఆందోళన చేసి బండి సంజయ్ ఇల్లును సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాయకంటి శ్రీనివాస్,సుంకరి సంపత్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగేందర్, SFI జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, మానస,నగర కమిటీ సభ్యులు పున్నం రవి, ఐద్వా జిల్లా నాయకులు ఉప్పునూటి లక్ష్మి, ఏఐఎస్ఎఫ్ నాయకులు శ్రీనివాస్, NFIW జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టే అంజలి, వామపక్ష నాయకులు శ్రీకాంత్, ఆంజనేయులు, రవి తదితరులు పాల్గొన్నారు.

