కలం, ఖమ్మం బ్యూరో: నిర్మాణ రంగానికి జీవనాధారమైన ‘ఇసుక’ పాల్వంచ ప్రాంతంలో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. “ఇసుక దొరికితేనే పని.. పని దొరికితేనే కూడు” అన్న చందంగా బతికే వేలాది కుటుంబాల నోట్లో మట్టి పడింది. అధికారుల కఠిన ఆంక్షలు, ప్రభుత్వ విధానాల నడుమ భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ (Palvancha) పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇసుక సంక్షోభం (Sand Crisis) ఉగ్రరూపం దాల్చింది. రోజువారీ కూలీల నుంచి మొదలుకొని ట్రాక్టర్ యజమానుల వరకు అందరి బతుకులూ ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన “మన ఇసుక” యాప్.. ఇప్పుడు ట్రాక్టర్ నిర్వాహకుల పాలిట శాపంగా మారింది. వినియోగదారులు యాప్‌లో బుక్ చేసుకుని ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు. అయితే, వారికి ఇసుక చేరవేసిన ట్రాక్టర్ యజమానులకు మాత్రం గత ఆరు నెలలుగా ప్రభుత్వం రవాణా బిల్లులు చెల్లించడం లేదు. సొంతంగా అప్పులు తెచ్చి, డీజిల్ పోయించి, డ్రైవర్లకు జీతాలు ఇచ్చుకుంటూ బండి లాగితే యజమానులు ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేశారు. బ్యాంక్ ఈఎంఐలు, ఫైనాన్స్ వడ్డీలు కట్టలేక పాల్వంచ, కొత్తగూడెం పరిధిలో సుమారు 50 కి పైగా ట్రాక్టర్లను నిలిపివేశారు.
నా వల్ల కావడం లేదు.. ట్రాక్టర్ ఆపేశా!
“ప్రభుత్వం నుంచి ఆరు నెలలుగా బిల్లులు రావడం లేదు. డ్రైవర్లకు జీతాలు, డీజిల్ ఖర్చుల కోసం ఇప్పటికే రూ. 80 వేలు అప్పు చేశాను. అటు అప్పు ఇచ్చినోళ్లు, ఇటు కూలీలు డబ్బుల కోసం ఒత్తిడి చేస్తుంటే తట్టుకోలేక ట్రాక్టర్ నడపడం బంద్ పెట్టాను.”
— రామకృష్ణ, బాధిత ట్రాక్టర్ యజమాని, పాల్వంచ
పాల్వంచ పరిధిలో అధికారిక గోదావరి ఇసుక క్వారీలు లేవు. గతంలో స్థానిక అవసరాల కోసం కిన్నెరసాని వాగు లేదా ఇతర చిన్న లోకల్ వాగుల నుండి ఇసుక తెచ్చేవారు. అయితే పర్యావరణ నిబంధనలు, కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ శాంక్చురీ రూల్స్ ప్రకారం మైనింగ్, అటవీ, రెవిన్యూ, పోలీస్ శాఖలు జాయింట్ ఆంక్షలు విధించాయి. స్థానిక వాగుల నుంచి ఇసుక తెస్తే కేసులు పెట్టి, వాహనాలను సీజ్ చేస్తున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకోవడాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. కానీ, ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా స్టాక్ యార్డులు గానీ, స్థానిక రాంపులు గానీ ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేవలం దంతెలబోరు ఇసుక ర్యాంపు మాత్రమే అరకొరగా పని చేస్తుండటంతో డిమాండ్‌కు తగ్గ సప్లై లేక ఇసుక బంగారంలా మారింది.
ఈ ఇసుక కొరత ప్రభావం సామాన్యుల కలల ఇళ్లపైనే కాకుండా, ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పైనా, ఇతర అభివృద్ధి కట్టడాల పైన గట్టిగా పడింది. కొత్తగూడెం నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, అందులో సగానికి పైగా ఇసుక లేక వివిధ దశల్లో ఆగిపోయాయి. ఇళ్లు మంజూరైనా కట్టుకోలేకపోతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్షోభం వల్ల తాపీ మేస్త్రిలు, సెంట్రింగ్ కార్మికులు, మజ్దూర్లు పూర్తిగా రోడ్డున పడ్డారు. రోజువారీ కూలి వస్తేనే ఇల్లు గడిచే వేలాది కార్మిక కుటుంబాలు ప్రస్తుతం పూట గడవడం గగనమై ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కావున పాల్వంచ ఇసుక సంక్షోభాన్ని ప్రభుత్వం అత్యవసర సమస్యగా గుర్తించాలని కార్మిక సంఘాలు, ట్రాక్టర్ నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.

