కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధ వేడి చల్లారడం లేదు. తాజాగా హర్మూజ్ జలసంధిలో (Hormuz Strait) అంతర్జాతీయ నౌకలపై దాడులు చేసేందుకు వచ్చిన రెండు ఇరాన్ డ్రోన్లను కూల్చివేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. నౌకల భద్రత కోసం తగు చర్యలు తీసుకుంటామని, ఇరాన్ దాడులను సమర్థంగా అడ్డుకుంటామని వెల్లడించింది. అమెరికా, ఇరాన్ మధ్య ఓ వైపు చర్చలు కొనసాగుతున్నా.. హర్మూజ్ జలసంధిలో మాత్రం ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఇరాన్ ద్వీపాలైన గోరుక్, ఖేష్మ్‌లోని నిఘా కేంద్రాలను ఇప్పటికే అమెరికా సైన్యం నాశనం చేసింది.
గల్ప్ దేశాలపై కొనసాగుతున్న దాడులు..
అమెరికా తనపై చేపడుతున్న దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై గురి పెట్టింది. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై మిస్సైల్స్ ప్రయోగించింది. తమ దేశాల్లోని నివాసిత ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులు పంపించిందని కువైట్, బహ్రెయిన్ మండిపడ్డాయి. ప్రాణాపాయం తప్పిందని, ప్రజలను సురక్షిత ప్రదేశాల్లోకి వెళ్లాలని ఆదేశించినట్లు పేర్కొన్నాయి. మరోవైపు, అగ్ర రాజ్యం డిమాండ్లలో చాలావాటికి టెహ్రాన్ అంగీకరించడం లేదు. పైపెచ్చు తమకు నష్ట పరిహారంతో పాటు ఫ్రీజ్ చేసిన నిధులను కూడా విడుదల చేయాలని ఇరాన్ అల్టిమేటం ఇస్తోంది.

