ఘనంగా 35వ ప్రాంతీయ స్థాయి ఖో-ఖో సమ్మేళనం ప్రారంభం

కలం, నాగర్‌ కర్నూల్: జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో నవోదయ విద్యాలయ సమితి 35వ హైదరాబాద్ ప్రాంతీయ స్థాయి ఖో-ఖో సమ్మేళనం (Kho Kho Regional Meet) బుధవారం ఘనంగా ప్రారంభమైంది. నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పతాకావిష్కరణ చేసి సమ్మేళనాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం క్రీడాజ్యోతిని వెలిగించి, వివిధ క్లస్టర్ల నుండి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. ఈ సమ్మేళనంలో కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం నుండి మొత్తం 7 క్లస్టర్లకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. హవేరి, మహె, మాండ్య, కాలబురగి, నిజామాబాద్, విజయనగరం, అనంతపూర్ క్లస్టర్లు పాల్గొన్నాయి.

ఈ కార్యక్రమానికి ముందు ఎన్‌సీసీ (NCC) క్యాడెట్లు ఎస్పీకి గౌరవ వందనం సమర్పించారు. ప్రిన్సిపాల్ బి. పూర్ణిమ ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ.. దేశ ప్రగతిలో నవోదయ విద్యాలయాల పాత్రను, వట్టెం నవోదయ విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడమే నవోదయ విద్యాలయ సమితి ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మాట్లాడుతూ.. ‘చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి దోహదపడతాయి. క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడతాయి. గెలుపోటములను సమానంగా స్వీకరించడమే నిజమైన క్రీడాస్ఫూర్తి’ అని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో DSP బి. శ్రీనివాస్, CI వై. అశోక్ కుమార్, SI షేక్ శంశుద్దీన్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ సుధా రాణి వందన సమర్పణ చేశారు. చరిత్ర ఉపాధ్యాయులు వి. భాస్కరాచారి స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం అతిథులను నవోదయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బాలాజీ నాయక్, వేణుగోపాల్, మాణిక్ ప్రభు, వ్యాయామ ఉపాధ్యాయులు రాధ, విజయ్ కుమార్, ఉపాధ్యాయులు, సిబ్బంది, ఖో-ఖో కోచ్‌లు, వివిధ రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>