కలం, నిర్మల్ : మృగశిర కార్తె నాడు చేపలు తింటే మంచిదని పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాన్ని ప్రజలు ఆచరిస్తూ ఆదివారం వచ్చిన మృగశిర కార్తె రోజున నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ప్రజలు చేపలు కొనుగోలు చేయడంతో మార్కెట్ సందడిగా మారింది. వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకారులు చేపలను తీసుకొచ్చి విక్రయించగా వాటిని కొనుగోలు చేసేందుకు స్థానికులు ఎగబడ్డారు. మృగశిర కార్తె ప్రభావంతో చేపల ధరలు పెంచి విక్రయించారు. ప్రజలు ధరలను ఏ మాత్రం లెక్కచేయకుండా కొనుగోలు చేశారు. ఆయా గ్రామాల్లో మత్స్యకారులు ఉదయం నుంచి చెరువుల్లో చేపలు పట్టి గ్రామాల్లో విక్రయించారు.

