రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా వినూత్న దీక్ష!

కలం, నిజామాబాద్ బ్యూరో: ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ అగ్రనాయకుల అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ నిజామాబాద్‌ (Nizamabad )లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. నిజామాబాద్ నగరంలోని బహుజన కాలనీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్, కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ చేతులకు తాడు సంకెళ్లు వేసుకుని వినూత్న రీతిలో తమ నిరసనను తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ఈ నిరాహార దీక్షకు ట్రాన్స్‌జెండర్లు కూడా హాజరై పూర్తి మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ మాట్లాడుతూ.. రాజధాని నడిబొడ్డున విద్యార్థుల రక్తం కళ్ళ చూశారని, విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వము మనుగడ కొనసాగించలేదని విమర్శించారు. రాబోయే కాలంలో మరింత ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. దేశానికి కాబోయే ప్రధానమంత్రి, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై పోలీసుల ముసుగులో ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలు దాడి చేసి అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ కరీం, పదవ డివిజన్ కార్పొరేటర్ అన్వర్, 59 వ డివిజన్ కార్పొరేటర్ అయ్యోబ్, ప్రధాన కార్యదర్శి అవిన్, సీనియర్ నాయకులు పర్వేజ్, జాఫర్, ట్రాన్స్ జెండర్స్ గంగ, జరిన, రక్ష, బహుజన కాలనీ నాయకులు మారుతి, ఇబ్రహీం, మహబూబ్, గోరేమియా తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>