కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. అటు ఇరాన్, ఇటు అమెరికా మొండి వైఖరితో రోజురోజుకు పరిస్థితి భయానకంగా మారుతోంది. సీజ్ ఫైర్ కొనసాగుతున్నా ప్రపంచదేశాల్లో భయం నెలకొన్నది. పలు దేశాలు చమురుకోసం కటకటలాడుతున్నాయి. అంతర్జాతీయస్థాయిలో వాణిజ్యరంగం దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో శనివారం మరోసారి ఇరాన్, అమెరికా (US – Iran) మధ్య చర్చలు జరగబోతున్నాయి. మరి ఈ చర్చలైనా ఫలిస్తాయా? అన్నది వేచి చూడాలి. అణుబాంబులు తయారుచేయబోమని ఇరాన్ స్పష్టమైన హామీ ఇవ్వాలని అగ్రరాజ్యం అమెరికా పట్టుబడుతోంది. అందుకు ఇరాన్ ఒప్పుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అమెరికా చెబుతోంది.
రెండో విడత చర్చలకు రంగం సిద్ధం
పాకిస్థాన్‌లో శనివారం రెండోవిడత చర్చలు జరగబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ చర్చలకు వెళ్లబోతున్నారు. ఇక ఇరాన్ నుంచి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి చర్చల్లో పాల్గొంటారని ఆ దేశ అధికారిక వార్తసంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. ఇది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంప్రదింపులు రూపంలో జరగనుంది. ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మధ్య సీజ్‌ఫైర్ మూడు వారాలు పొడిగించిన మరుసటి రోజు ఈ చర్చలు జరుగుతుండటం గమనార్హం. ఏప్రిల్ 11, 12 తేదీల్లో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మొదటి రౌండ్ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. దీంతో రెండో దశ చర్చలైనా ఫలించాలని అంతర్జాతీయ సమాజం కోరకుంటున్నది.
మొదటి దశ చర్చలు ఫెయిల్
మొదటి దశ చర్చల్లో మూడు కీలక అంశాలపై ఇరు దేశాల నడుమ ఏకాభిప్రాయం కుదరలేదు. ఇరాన్ అధికస్థాయిలో యురేనియం సమకూర్చుకోవద్దని అమెరిగా తేల్చి చెప్పింది. హార్ముజ్ జలసంధి తిరిగి తెరవాలని కోరింది. ఇందుకు ఇరాన్ అంగీకరించకపోవడంతో చర్చలు సఫలం కాలేదు. అప్పట్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాట్లాడుతూ.. 21 గంటలపాటు జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి సాధించలేదని చెప్పారు. ప్రస్తుతం అమెరికా నౌకాదళం ఇరాన్ ఓడరేవులను ధ్వంసం చేస్తోంది. ఇరాన్ కూడా జలసంధిని నియంత్రిస్తోంది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఎంతవరకు పనిచేస్తుందో వేచి చూడాలి. ఈ రెండో దశ చర్చలు ఫలించి యుద్ధాన్ని ముగిసిపోవాలని అంతర్జాతీయంగా పలు దేశాలు కోరుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో కార్యకలాపాలు పునరుద్ధరించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
Read Also: సాయుధ పోరాటాన్ని వదలం.. మావోయిస్టు పార్టీ ప్రకటన!
Follow Us On : WhatsApp

