కలం, నార్కట్పల్లి : నార్కట్పల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గుట్ట కింద శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం (Cheruvugattu Fire Accident) సంభవించింది. క్షేత్ర పరిసరాల్లోని నంది విగ్రహం సమీపంలో ఉన్న ఒక బొమ్మల దుకాణంలో ప్రారంభమైన మంటలు క్షణాల్లో పక్కనే ఉన్న ఇతర దుకాణాలు, తోపుడు బండ్లకు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుమారు 17 బొమ్మల దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
దుకాణాల్లోని విక్రయ సామగ్రి మంటల్లో కాలి బూడిదవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన బాధిత వ్యాపారులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రమాద సమయంలో స్థానికులను మరింత భయాందోళనకు గురిచేస్తూ రెండు గ్యాస్ సిలిండర్లు పేలినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దుకాణాల సమీపంలోనే ఉన్న గ్రామ పంచాయతీ భవనానికి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో ఆఫీసు లోపల ఉన్న పలు ముఖ్యమైన ప్రభుత్వ దస్త్రాలు (ఫైళ్లు) అగ్నికి ఆహుతయ్యాయి.
ఈ ప్రమాదంలో సుమారు రూ.2.5 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానిక గ్రామ సర్పంచ్ వెల్లడించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రెస్క్యూ వాహనాలతో రంగానికి దిగారు. ఏకధాటిగా 3 ఫైర్ ఇంజిన్ల సహాయంతో శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం అర్ధరాత్రి వేళ జరగడం, ఆ సమయంలో దుకాణాల్లో వ్యాపారులు గానీ, భక్తులు గానీ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీంతో స్థానికులు, ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

