కలం, వెబ్ డెస్క్: అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య జరగాల్సిన రెండో దశ చర్చలు ముందుకు సాగే సూచనలు కనిపించడం లేదు. ఏప్రిల్ 22న మంగళవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ (Islamabad)లో చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఈ చర్చలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ ప్రతిపాదనకు స్పందించిన ఇరాన్ చర్చల్లో పాల్గొనబోమని స్పష్టం చేసింది. అమెరికా తమ పోర్టులపై అమలు చేస్తున్న నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు ఎలాంటి చర్చలు జరగవని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా తీరు కారణంగానే హార్మూజ్ మూసివేశామని తెలిపింది. అమెరికా విధానాలు, కఠినమైన షరతులు, దిగ్బంధన చర్యల కారణంగా చర్చలకు అవకాశం లేదని ఇరాన్ పేర్కొంది.
మరోవైపు నేడు సాయంత్రమే అమెరికా బృందం పాకిస్తాన్‌కు చేరుకోనుంది. ఈ మేరకు ఇస్లామాబాద్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. చర్చల్లో పాల్గొనేందుకు జేడీ వాన్స్, స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ వెళ్లనున్నారు. ఏప్రిల్ 22తో కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తుందని ట్రంప్ ప్రకటించారు. నౌకా దిగ్బంధం విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఒక వేళ ఇరాన్ చర్చలకు వచ్చి ఒప్పందానికి అంగీకరించకపోతే విధ్వంసం సృష్టిస్తామని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.

