మ‌హిళా మంత్రిపై బాడీ షేమింగ్‌.. సింగ‌ర్‌ చిన్మ‌యి స్ట్రాంగ్ రిప్లై

క‌లం, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో మహిళా మంత్రులపై జరుగుతున్న బాడీ షేమింగ్, వ్యక్తిగత విమర్శలపై ప్రముఖ సింగ‌ర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) తీవ్రంగా స్పందించారు. మంత్రి కీర్తన (Minister Keerthana) వేషధారణ, ఆమె ముక్కుపుడక పెట్టుకోవడం వంటి అంశాలపై యూట్యూబర్ మరిదాస్ చేసిన వ్యాఖ్యలను చిన్మయి ఎక్స్ వేదిక‌గా తప్పుబట్టారు. ఒక మహిళా మంత్రి తన పని తీరు, నైతికత లేదా సామర్థ్యం ఆధారంగా విమర్శలు ఎదుర్కోవాలి కానీ, ఆమె ధరించే దుస్తులు లేదా అలంకరణపై లింగ వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయాల్లో ఉన్న మహిళలు కేవలం పురుషుల మెప్పు కోసమో లేదా సమాజ కట్టుబాట్ల కోసమో చీరలే ధరించాలనే నిబంధన లేదని చెప్పారు. మ‌హిళ‌లు తమకు నచ్చిన, సౌకర్యవంతమైన దుస్తులు ధరించే హక్కు ఉందని ఆమె స్పష్టం చేశారు.

సమర్థతతో మంత్రి పదవిని చేపట్టిన మహిళలను నిరక్షరాస్యులంటూ కించపరచడం పురుష అహంకారానికి నిదర్శనమని చిన్మయి విమర్శించారు. కేవలం మూడు వారాల పదవీ కాలంలో ఒక మంత్రి వేసుకునే లిప్‌స్టిక్ వల్ల తమిళనాడు మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి వచ్చిన నష్టమేమీ లేదని ఆమె ఎద్దేవా చేశారు. ప్రగతిశీలవాదులమని చెప్పుకునే పురుషులు రాజకీయ నాయకుల పనిలోని లోపాలను ఎత్తిచూపాలి కానీ, వారి వ్యక్తిగత అలంకరణపై దృష్టి పెట్టడం మానుకోవాలని హితవు పలికారు. మహిళలు అధికారంలోకి వచ్చి నిర్ణయాధికార స్థానాల్లో ఉన్నారనే నిజాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి వెర్బల్ హరాస్‌మెంట్‌కు పాల్పడుతున్నారని చిన్మయి పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>