కలం, నిర్మల్ : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్హెచ్ఎం ఉద్యోగులు (NHM Employees) చేపట్టిన నిరవధిక సమ్మె వినూత్న నిరసనలతో కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న సమ్మె 21వ రోజుకు చేరుకోగా, ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు సమ్మె శిబిరంలోనే బారసాల కార్యక్రమం (Barasala Ceremony) నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉయ్యాల కట్టి, బారసాల పాటలు పాడుతూ ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినూత్న రీతిలో తెలియజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సర్వీసుల క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని, ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 21 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని, ప్రభుత్వం స్పందించి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

