కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్ (Modala Srinivas Sagar) అన్నారు. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. సోమవారం బీసీ సమాజ్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ సాగర్ మాట్లాడారు.
పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగం, విద్యా రంగ సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ విధానాలపై శాసనమండలిలో తమ గొంతుక వినిపించేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ వ్యవస్థ ఒక ముఖ్యమైన వేదిక అని పేర్కొన్నారు. అయితే చాలా మంది డిగ్రీ పూర్తి చేసినప్పటికీ పట్టభద్రుల ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవడం లేదని, దీనివల్ల తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారని అన్నారు.
కాబట్టి డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం ప్రకటించిన అర్హతలు, గడువులను పరిశీలించి పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఓటరు నమోదుకు నాలుగు రోజుల గడువు ఉన్నందున ముఖ్యంగా యువత, మహిళా పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న పట్టభద్రులు ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

